14 July, 2026 | 11:45 PM

నిస్సహాయంగా ఎన్టీఏ

25-06-2024 05:33 AM
  • డార్క్‌వెబ్ ముప్పును ఎదుర్కోలేక తిప్పలు
  • పరీక్షల నిర్వహణలో డొల్లతనం బహిర్గతం
  • నీట్ పేపర్ లీక్‌పై సీబీఐ విచారణ ముమ్మరం

న్యూఢిల్లీ, జూన్ 24: జాతీయ స్థాయి పరీక్షలను ఒకే గొడుకు కిందికి తెస్తూ 2017లో ప్రారంభమైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)  ప్రారంభంలో ఎంతటి మంచి పేరు సంపాదించుకొన్నదో.. ఇప్పుడు నీట్, నెట్ పేపర్ల లీక్‌తో అంత అప్రతిష్ఠ మూటగట్టుకొన్నది. ఎన్టీఏ పరీక్ష నిర్వహించిందంటే ఎక్కడా తప్పు జరుగదు అన్న పేరు ఇప్పుడు ఒక్కసారిగా గంగలో కలిసిపోయింది. నీట్ యూజీసీ పేపర్ లీకేజీ నేపథ్యంలో ఎన్టీఏలోని డొల్లతనమంతా ఒకొక్కటిగా బయటపడుతున్నాయి.

జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణ ఎన్టీఏ చేతికి వచ్చిన తర్వాతనే కంపూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)ల నిర్వహణ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇంత పేరున్నా నీట్ యూజీ పేపర్ తేలిగ్గా బయటకు వెళ్లిపోయింది. యూజీసీ నెట్ పేపర్‌ను హ్యాకర్లు డార్క్‌వెబ్‌లో డౌన్‌లోడ్ చేసుకొన్నారు. ఈ సాంకేతిక సవాళ్లకు ఎన్టీఏ వద్ద సమాధానమే లేకపోయింది. పైగా నీట్ పేపర్ లీకేజీని కప్పిపుచ్చేందుకు ఎన్టీఏ, కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించి మరింత అప్రతిష్ఠను మూటగట్టుకొన్నాయి. ఇకపై ఈ సంస్థ ఏ పరీక్ష నిర్వహించినా అనుమానిస్తూనే ఉంటారని చెప్తున్నారు. 

దేశం మొత్తం విస్తరిస్తున్న లీకేజీలు

నీట్ పేపర్ లీక్‌పై సీబీఐ దర్యాప్తు మొదలుపెట్టడంతో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లీక్ వ్యవహారం బీహార్, గుజరాత్‌కే పరిమితం కాలేదని, దేశవ్యాప్తంగా ఈ దందా నడిచిందని తెలుస్తున్నది. తాజాగా మహారాష్ట్రలోని లాతూర్‌లో  నీట్ పేపర్ లీక్‌పై కేసు నమోదైంది. లాతూర్‌లో జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న సంజయ్ తుకారాం జాదవ్, జలీల్ ఉమర్‌ఖాన్ పఠాన్ సొంతంగా నీట్ కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నారు.

తమ కోచింగ్ సెంటర్లకు మంచి ర్యాంకులు సంపాదించేందుకు నీట్ పేపర్‌ను లీకేజీ ముఠా నుంచి కొనుగోలు చేసినట్టు నాందేడ్ ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్) పోలీసులు గుర్తించారు. వారిద్దని అరెస్టు చేశారు. ఢిల్లీకి చెందిన గంగాధర్ అనే వ్యక్తితో సంబంధాలు పెట్టుకొని తమ కోచింగ్ సెంటర్లలో చేరిన విద్యార్థులకు కచ్చితంగా మంచి ర్యాంకు సాధించిపెడుతామని నమ్మించి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్టు గుర్తించారు. గంగాధర్‌తోపాటు ధారాశివ్ జిల్లాకు చెందిన ఐరన్న మష్నాజీ కొంగల్వార్‌ను కూడా అదుపులోకి తీసుకొన్నారు. మరోవైపు నీట్ పేపర్ లీక్‌పై సీబీఐ మరింత లోతుగా దర్యాప్తు జరుపాలని నిర్ణయించింది. దాదాపు వెయ్యి ఫోన్‌కాల్స్‌ను పరిశీలించాలని నిర్ణయించినట్టు తెలిసింది.  

బీహార్‌లో ఆటవిక రాజ్యం: తేజస్వీయాదవ్

నీట్ పేపర్ లీక్‌పై దర్యాప్తు కోసం వెళ్లిన సీబీఐ అధికారులపై దాడి జరుగటంపై బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ తీవ్రంగా స్పం దించారు. దేశంలో ఆటవిక రాజ్యం నడుస్తుందనటానికి సీబీఐ అధికారులపై దాడే నిదర్శ నమని విమర్శించారు. ‘మీరే పరీక్ష పేపర్ లీక్ చేయించి, మీరే దానిపై దర్యాప్తు చేస్తున్న అధికారులపై దాడులు చేయించి, మీరే ఇతరులను ఆటవికులుగా అభివర్ణిస్తారు. ఇది ఆటవిక రాజ్యం కాదా?’ అని ప్రశ్నించారు.