ఈ రెస్టారెంట్లలో రుచే వేరు..
ముంబై, మే 23: మాంచి.. రుచికరమైన భోజనం అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి! నచ్చిన ఆహారం తినేందుకు కొందరైతే ఎంతదూరమైనా వెళ్తారు. మరి మంచి భోజనం ఫలానా చోట దొరుకుతుందని ఎలా తెలుసుకోవటం? ఇదిగో.. విలియం రీడ్ మీడియా కంపెనీ అనే సంస్థ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ మనుషులు హోటళ్లల్లో రుచులను ఆస్వాదించి ప్రపంచంలో అత్యంత రుచి కరమైన ఆహారం అందించే టాప్ 50 రెస్టారెంట్లను ఎంపిక చేశారు. అదే సంస్థ 51 నుంచి 100 అత్యుత్తమ రెస్టారెంట్లు అంటూ మరో జాబితాను విడుదల చేసింది. అందులో మన దేశానికి చెందినవి కూడా రెండు రెస్టారెంట్లు చోటు సంపాదించాయి. మాస్క్ అనే ముంబై రెస్టారెంట్ ఈ జాబితాలో 78వ స్థానంలో నిలిచింది. ఢిల్లీకి చెందిన ఇండియన్ యాక్సెంట్ అనే మరో రెస్టారెంట్ 89వ స్థానం సంపాదించింది. వీటి ఘనతలు చాలానే ఉన్నాయి. ఆసియాలోని అత్యుత్తమ 50 రెస్టారెంట్ల జాబితాల్లో 2023లోనూ, 2024లో కూడా మాస్క్ రెస్టారెంట్ భారత్‌లో అత్యుత్తమ రెస్టారెంట్‌గా రికార్డు కొట్టేసింది. ఇక ఢిల్లీలోని లోథీలో ఉన్న ఇండియన్ యాక్సెంట్ రెస్టారెంట్‌కైతే మరింత పెద్ద చరిత్రే ఉన్నది. ఈ రెస్టారెంట్ 2015 నుంచి 2021 వరకు ఏకంగా వరుసగా ఏడేండ్లు దేశంలో అత్యుత్తమ రెస్టారెంట్ కిరీటాన్ని దక్కించుకొన్నది.






