7 June, 2026 | 2:52 AM

పేపర్‌లోని వార్తలనే ట్యూన్‌గా మార్చేవాడిని!

07-06-2026 12:43 AM

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ‘సింగ్ గీతం’తో ముందుకు వస్తున్నారు. ప్రతిష్టాత్మక బ్యానర్లు వైజయంతి మూవీస్, స్వప్న సినిమాపై నాగ్‌అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీత సారథ్యం వహించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా గురించి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ విశేషాలివీ.. 

సింగీతం శ్రీనివాసరావుతో సినిమా అనగానే మీ ఫీలింగ్ ఏంటి?

నేను సింగీతం గారికి వీరాభిమానిని. ఆయన లెజెండ్. నాన్నను కలవడానికి వచ్చేటప్పుడు వాళ్లు మాట్లాడుకుంటుంటే నేను ఆరాధనగా చూసేవాడిని. చాలా ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్‌తో జీసెస్‌పై ఒక సినిమా అనుకున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల అది జరగలేదు. ఆ సమయంలో సింగీతం మా స్టూడియోకు వచ్చి ‘సింగ్ గీతం’ ఐడియా చెప్పారు. అది వినగానే నాకు చాలా థ్రిల్‌గా అనిపించింది. ఎప్పుడైనా ఆ సినిమా చేయాలని అనిపించింది.

-సింగీ తం చేసిన ప్రయోగాలు మరెవ్వరూ చేసి ఉండరు. పుష్పక విమానం, భైరవద్వీపం, ఆదిత్య 369 వంటి చిత్రాలు నాకు చాలా ఇష్టం. మూడేళ్ల క్రితం ఈ ప్రాజెక్ట్ చేస్తున్నామని ఆయన నుంచి ఫోన్ వచ్చింది. తర్వాత ఏడాది క్రితం నాగ్ అశ్విన్, స్వప్న, వైజయంతి మూవీస్‌తో కలిసి ఈ సినిమా రూపొందుతుండటం మరింత ఆనందాన్నిచ్చింది. -ఈ సినిమాను నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా. సింగీతం కి ఒక ట్రిబ్యూట్‌లా, ఆయనతో కలిసి పనిచేయడం ఒక బ్లెస్సింగ్‌గా అనిపించింది. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. 

సింగీతం చాలా ఏళ్ల క్రితమే ఈ కథ అనుకున్నారు కదా.. ఈ రోజులకు ఈ కథ ఎంత రిలెవెంట్‌గా ఉంటుంది? 

సింగీతం ఎప్పుడూ ట్రెండ్‌కు తగ్గ ట్టు కథలు ఆలోచించలేదు. ఆయనకు ఒక ఆలోచన వచ్చిందంటే అది ఇంతకుముందు రానిది, తర్వాత కూడా రానిదిగా ఉంటుంది. ఆయ న చేసిన సినిమాలన్నీ గమనిస్తే అలాంటివే. పుష్పక విమానం ఇప్పటికీ చాలా అడ్వాన్స్ సినిమా. -‘సింగ్ గీతం’ ఐడియా కూడా అంతే కొత్తగా ఉంటుంది. కళ, సంగీతా నికి సంబంధించిన అంశాలు ఎప్పటికీ పాతబడవు.

ఉదాహరణకు విశ్వనాథ్ ‘సాగర సంగమం’ ఎప్పటికీ పాతబడదు. ఒక గ్రామం మొత్తం మాట్లాడలేక, కేవలం పాటల రూపంలోనే సంభాషించే కథ ఇప్పటివరకు రాలేదు. -ఇది కేవలం కామెడీ సినిమా కాదు. ఇందులో అద్భుత మైన భావోద్వేగాలు కూడా ఉన్నాయి. సింగీతంకి నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాలి. -నాగ్‌అశ్విన్, స్వప్న.. అందరం ప్రాణం పెట్టి చేశాం. 

మాటలన్నీ పాటలుగా చేశారు కదా.. ఆ అనుభవం గురించి చెప్పండి?

నిజంగా ఇది నా కెరీర్‌లో అత్యంత ఛాలెంజింగ్ సినిమా. నాకు స్క్రిప్ట్ ఇచ్చారు. ఆ స్క్రిప్ట్ మొత్తం చదివి ప్రతి డైలాగ్‌ను సంగీతంగా మార్చాల్సి వచ్చింది. -ఇలాంటి సినిమాలకు భాషపై మంచి పట్టు ఉండాలి. నాకు చిన్నప్పటి నుంచి మైకేల్ జాక్సన్, ఇళయరాజా లాంటి సంగీతం చేయాలనే కోరిక ఉండేది. ట్యూన్స్ కట్టడం వచ్చేది. కానీ లిరిక్స్ ఉండేవి కావు. అప్పుడు న్యూస్ పేపర్ తీసుకుని అందులో ఉన్న వార్తలనే ట్యూన్‌గా మార్చుకునేవాడిని. మా నాన్న చూసి నవ్వేవారు.

-చిన్నప్పటి నుంచి ప్రతి అక్షరాన్ని సంగీతంగా మార్చే అలవాటు నాకు ఉండేది. తెలిసో తెలియకో అదే ఈ సినిమాకు ఉపయోగపడింది. ఒక సీన్ తీసుకుని మ్యూజికల్‌గా చేసి వినిపించా. అది విని సింగీతం చాలా సంతోషించారు. ‘మనకు కావాల్సిన మ్యూజిక్ ఇదే’ అన్నారు. అది నాకు పెద్ద కాంప్లిమెంట్‌గా అనిపించింది. -ఈ సినిమా కోసం ప్రతిదీ ముందుగానే మ్యూజికల్‌గా చేసి ఇచ్చాం.

తర్వాత దానిని షూట్ చేశారు. -మిగతా సినిమాలకు ఒక ఫార్మాట్ ఉం టుంది. కానీ ఈ సినిమాకు అలాం టి ఫార్మాట్ లేదు. నేనే కొత్త ఫార్మాట్ కనిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ పాడగలిగారు. కొంతమందికి శిక్షణ కూడా ఇచ్చాం. 24 గంటలూ డ్యూటీలో ఉండేవాడని (నవ్వుతూ). చాలా ఎంజాయ్ చేస్తూ చేశా. జీవితంలో ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. 

సినిమా చూసుకున్న తర్వాత ఎలా అనిపించింది?

-మేమంతా నిన్ననే స్టూడియోలో కూర్చుని సినిమా చూశాం. సినిమా చూస్తున్నప్పుడు మళ్లీ సింగీతం విజన్‌కు ముగ్ధులమైపోయాం. ఆయన ఆలోచనల గొప్పతనం మరోసారి అర్థమైంది. పనిపరంగా -ఇది నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చిన ప్రాజెక్ట్. ప్రతి డైలాగ్ మ్యూజికల్‌గా ఉన్నా, అవి చాలా సహజంగా అనిపిస్తాయి.

కొంతసేపటి తర్వాత పాటలు వింటున్నామనే విషయమే మర్చిపోతారు ప్రేక్షకులు. ఈ విషయంలో సింగీతంకు నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాలి. సినిమా చూసి ఇంటికి వెళ్తూ సరదాగా మాటల్ని కూడా పాటల్లా పాడుకుంటూ వెళ్తారని నమ్ముతున్నా. -కమల్‌హాసన్ స్టూడియోకు వచ్చి సినిమా చూశారు. చాలా సంతోషించారు. ‘ఇలాంటి సినిమాలో నేను కూడా భాగం కావాల్సింది’ అన్నారు. అది మాకు ఎంతో ఆనందాన్నిచ్చింది. 

‘ఎల్లమ్మ’ గురించి..?

-చాలా పని పూర్తయింది. కొన్ని పాటలు చేశా. ఒక ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌కు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా కంపోజ్ చేశా. దిల్ రాజు నెలకు 10 రోజుల ఇవ్వమని చెప్పారు. ఆ విధానం నాకు చాలా నచ్చింది. ప్రస్తుతం కథ గురించి ఎక్కువ చెప్పలేను. ఇది రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ.