7 June, 2026 | 1:59 AM

జనవరి 13 విడుదల.. ఇదే సినిమా టైటిల్!

07-06-2026 12:40 AM

మల్టీస్టారర్ చిత్రాలకు టాలీవుడ్‌లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఒకే స్క్రీన్‌లో ఇద్దరు క్రేజీ హీరోలు కనిపిస్తే ఆ మజాయే వేరు అంటారు ఇక్కడి ప్రేక్షకులు. ఇప్పుడు అలాంటి ఒక సూపర్ కాంబినేషన్‌ను సెట్ చేసి ట్రేడ్ వర్గాల దృష్టిని ఆకర్షించారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్, నందమూరి కల్యాణ్‌రామ్ తొలిసారి కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రంలో కల్యాణ్‌రామ్ సరసన టాలీవుడ్ యంగ్ బ్యూటీ కృతిశెట్టి నటిస్తుండగా, విక్టరీ వెంకటేశ్‌కు జోడీగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

దీంతో ఇది మోస్ట్ అవేటెడ్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌గా మారిం ది. జూన్ 18న పూజా కార్యక్రమంతో ప్రారంభం కానున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇదే నెల 22 నుంచి ప్రారంభించడానికి మేకర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సినిమా ఇంకా ప్రారంభం కాక ముందే తాజాగా ఈ ప్రాజెక్టు గురించి నెట్టింట ఒక క్రేజీ అప్డేట్ వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ విషయమై సోషల్ మీడియాలో భారీ స్థాయిలో చర్చ నడుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అనిల్ రావిపూడి ఈ సినిమాకు ‘జనవరి 13 విడుదల’ అనే టైటిల్‌ను దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తోం ది. అనిల్ రావిపూడి ఈ మధ్య ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు’ వంటి కొత్త టైటిల్స్ పెడుతున్న సంగతి తెలిసిందే. పండగ సీజన్‌ను టార్గెట్ చేస్తూ, తన కొత్త సినిమాకు కూడా నేరుగా ఇలా విడుదల తేదీనే సినిమా టైటిల్‌గా పెట్టేశాడు రావిపూడి. పక్కా ఫ్యామిలీ అండ్ పండగ ఎంటర్‌టైనర్‌లా రూపొందనున్న ఈ సినిమాను నిర్మాతలు 2027 సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు.

‘జనవరి 13 విడుదల’ అనే టైటిల్‌ను బట్టి చూస్తే.. ఈ సినిమా 2027 జనవరి 13న విడుదలయ్యే అవకాశముంది. ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించి షూటింగ్ జూన్ నెలాఖరు నుంచి మొదలు కానుంది. కల్యాణ్‌రామ్, కృతిశెట్టి, మిగతా తారాగణంపై కొన్ని సీన్స్ తీయనున్నారు. జూలై లేదా ఆగస్టు నుంచి వెంకటేశ్ సెట్స్‌లో అడుగుపెడతారు. వెంకీ మామ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు.