7 June, 2026 | 2:54 AM

మహిళా ప్రాధాన్య చిత్రంలో..

07-06-2026 12:45 AM

కోలీవుడ్ యంగ్ టాలెంటెడ్ ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా బహుముఖ ప్రతిభతో కెరీర్‌లో దూసుకెళ్తున్న ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు నిర్మాతగా తన రెండో సినిమాను పట్టాలెక్కించనున్నాడు.

అయితే, ప్రదీప్ రంగనాథన్ నిర్మాణంలో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ రాబోతోందని, అందులో మమిత బైజు ప్రధాన పాత్రలో నటించనుందని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. మరో కోలీవుడ్ యంగ్ బ్యూటీ స్వాసిక తాజాగా పెట్టిన ఓ పోస్ట్ ఆ వార్తలకు బలం చేకూర్చింది. మొత్తానికి మమిత బైజు మహిళా ప్రాధాన్య సినిమాతో అలరించనుందన్న సంగతి కన్ఫర్మ్ అయింది. ఇంతకీ స్వాసిక తన పోస్ట్‌లో ఏం పేర్కొన్నదంటే.. “ప్రదీప్ రంగనాథన్ నిర్మాణంలో ఒక కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది.

ఈ సినిమాతో అశ్వత్ మరిముత్తు హీరోగా పరిచయమవుతున్నారు. ప్రేక్షకుల ఫేవరెట్ మమిత బైజు లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ చిత్రంలో నేను కూడా ఒక భాగమయ్యా. షూటింగ్‌లోనూ జాయిన్ అయ్యా. ఈ క్రేజీ కాంబోలో నాకు ఒక మంచి ప్రాధాన్యం ఉన్న పాత్ర దక్కింది. మమిత బైజు, అశ్వత్ మరిముత్తులతో కలిసి నటిస్తున్నా” అంటూ వివరాలు రాసుకొచ్చింది. ఇక హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను అలరిస్తున్న స్వాసిక ఇటీవల సూర్య ‘కరుప్పు’ (తెలుగులో వీరభద్రుడు)లో కీలక పాత్రలో కనిపించింది. విజయ్ ఆంటోనీ తో కలిసి నటించిన ‘నూరు సామి’ సినిమా జూన్ 19న విడుదల కానుంది.