28 July, 2026 | 11:31 AM

ఇక గుజరాత్ సర్కారును నమ్మలేం

28-05-2024 12:05 AM

నాలుగేండ్ల నుంచి అధికారులు నిద్రపోయారా?

రాజ్‌కోట్ అగ్నిప్రమాదంపై హైకోర్టు ఆగ్రహం

వెల్డింగ్ నిప్పురవ్వల వల్లే ప్రమాదం జరిగిందనే అనుమానాలు

గాంధీనగర్, మే 27: గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో గేమింగ్‌జోన్‌లో అగ్నిప్రమాదం జరిగి 32 మంది మరణించిన ఘటనపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. రాజ్‌కోట్‌లో రెండు గేమింగ్ జోన్ సెంటర్లు ఎలాంటి అనుమతులు లేకుండా, కనీస ఫైర్ సేఫ్టీ లేకుండా 24 నెలలుగా నడుస్తుండటంపై మున్సిపల్ అధికారులను కోర్టు తలంటింది. ప్రభుత్వంపై పూర్తిగా నమ్మకం పోయిందని పేర్కొన్నది. ఈ ఘటనను సుమోటో కేసుగా స్వీకరించిన హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ‘గేమింగ్ జోన్ ఏర్పాటుకోసం మా అనుమతి తీసుకోలేదు’ అని మున్సిపల్ అధికారులు తెలిపారు. దీంతో ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘గేమింగ్ జోన్ రెండున్నరేండ్ల నుంచి నడుస్తున్నది. మీకు కండ్లు కనిపించటం లేదని అనుకోవాలా? మీరు, మీ అనుయాయులు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? గుడ్డవాళలు అయిపోయారా? ఇప్పుడు మేం స్థానిక ప్రభుత్వంతోపాటు రాష్ట్రప్రభుత్వాన్ని కూడా నమ్మలేం’ అని స్పష్టంచేసింది. మున్సిపల్ అధికారులు గేమింగ్‌జోన్‌లో ఉన్న పాత ఫొటోలను ప్రస్తావిస్తూ.. ఎవరు ఆ అధికారులు? ఆడుకోవటానికి అక్కడికి వెళ్లారా?’ అని ప్రశ్నించింది.

కొత్త జంట దుర్మరణం

గేమింగ్ జోన్ అగ్నిప్రమాదంలో కొత్తగా పెండ్లయిన ఓ జంట దుర్మరణంపాలయ్యింది. అక్షయ్ ధొలారియా ఆయన భార్య ఖ్యాతితోపాటు ఖ్యాతి సోదరి హరిత కూడా మరణించినట్టు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి వారంరోజుల ముందే వారు పెండ్లి చేసుకోవటం గమనార్హం. ప్రమాదానికి బాధ్యులను చేస్తూ ఇద్దరు పోలీస్ అధికారులు, ముగ్గురు సివిల్ సిబ్బంది సహా ఆరుగురిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కాగా, ఈ ప్రమాదానికి వెల్డింగ్ నిప్పురవ్వలు ఎగసి పడటమే కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా బయటకొచ్చిన ఓ సీసీటీవీ ఫుటేజీ ఈ వాదనను బలపరుస్తున్నది. గేమింగ్‌జోన్‌లో వెల్డింగ్ పనులు చేస్తుండగా, పక్కనే ఉన్న కర్రలపై నిప్పురవ్వలు పడి మంటలు అంటుకున్నాయి. దీంతో అక్కడ పనిచేస్తున్నవారు బయటకు పరుగులు తీస్తున్న దృశ్యాలు వీడియోలో రికార్డు అయ్యాయి.