అమెరికాలో హిందూఫోబియా
రెండో స్థానానికి హిందూ వ్యతిరేక నేరాలు
మూడోస్థానంలో ఇస్లామోఫోబియా
కాలిఫోర్నియా ప్రభుత్వ నివేదికలో వెల్లడి
కాలిఫోర్నియా (అమెరికా), మే 27: అమెరికాలోని కాలిఫోర్నియాలో హిందూ వ్యతిరేకత పెరిగిపోతోంది. కాలిఫోర్నియా పౌర హక్కుల విభాగం (సీఆర్‌డీ) నివేదిక ప్రకారం రాష్ట్రంలో మత విద్వేషాల్లో హిందూ వ్యతిరేక నేరాలు రెండో స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి స్థానంలో యూదు వ్యతిరేక నేరాలు (సెమిటిజం) ఉండగా మూడో స్థానంలో ఇస్లామోఫోబియా ఉంది. 2023లో విద్వేషపూరిత నేరాలను నియంత్రించేందుకు కాలిఫోర్నియా వర్సెస్ హేట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం మొదలైన తొలి ఏడాదిలోనే 1000కిపైగా ఫిర్యాదులు వచ్చాయి.
గరిష్ఠ స్థాయికి చేరిక..
తాజా నివేదిక ప్రకారం యూదులకు వ్యతిరేకంగా 37 శాతం, హిందువులకు వ్యతిరేకంగా 23.3 శాతం, ఇస్లామోఫోబియా నేరాలు 14.6 శాతంగా ఉన్నాయి. ఇంకా చాలావరకు ద్వేషపూరిత నేరాలు వెలుగులోకి రావడంలేదు. ఈ నేరాల్లో 18.4 శాతం వివక్షతో చూడటం, 16.7 శాతం గేలి చేసి వేధించడం, 16.7 శాతం పేర్లను అవమానించడం, దూషించడం వంటి అధికంగా ఉన్నాయని తెలిపింది. ఇలాంటి నేరాలు 2001 నుంచి భారీగా పెరుగుతున్నాయని, 2020 మధ్య గరిష్ఠ స్థాయిలో 33 శాతానికి చేరినట్లు ఈ నివేదిక వివరించింది. ఈ క్రైమ్స్ నివాస ప్రాంతాల్లో 29.9 శాతం, పని ప్రదేశాల్లో 9.7 శాతం, బహిరంగ ప్రాంతాల్లో 9.1 శాతం జరుగుతున్నాయి. నివేదిక రాష్ట్రంలోని 80 శాతం కౌంటీలను ప్రస్తావించగా ఇందులో 10 అత్యధిక జనాభా కలిగినవి ఉన్నాయి.
హిందూ వ్యతిరేక ఘటనలు..
భారతీయ అమెరికన్లు ముఖ్యంగా హిందువులపై ద్వేషపూరిత నేరాల్లో ఆకస్మిక పెరుగుదల వల్ల సమాజంలో భయాందోళనలను కలిగిస్తోంది. ప్రత్యేకించి శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌ను తగలబెట్టేందుకు ప్రయత్నించడం, భారత దౌత్యవేత్తలకు బెదిరింపులు, వ్యతిరేక నినాదాలు చేసిన ఘటనలే ఇందుకు నిదర్శనం.






