చెత్త బుట్టలో రక్త నమూనాలు
పుణె రోడ్డ ప్రమాద నిందితుడికి అన్నివైపుల సాయం
మొదట పోలీసుల అలసత్వం.. తర్వాత డాక్టర్ల సహకారం
పుణె, మే 27: పుణెలో ఓ ధనవంతుల బిడ్డ తప్పతాగి ఖరీదైన కారును అతివేగంగా నడిపి ఇద్దరికి మరణానికి కారణమైన కేసులో రోజు సంచలనం బయటకొస్తున్నది. నిందితుడిని రక్షించేందుకు అన్ని ప్రభుత్వ విభాగాలు శాయశక్తులా ప్రయత్నించినట్టు వెల్లడైంది. మొదట ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి వెళ్లిన స్థానిక పోలీస్‌స్టేషన్ పోలీసులు.. ఆ విషయాన్ని పై అధికారులకు తెలియకుండా వీలైనంత ఎక్కువ పేపు ఆపారు. ఆ తర్వాత ప్రజల ఆగ్రహంతో బాలున్ని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లినా.. అతడికి వీఐపీకి ట్రీట్‌మెంట్ ఇచ్చి పిజ్జాలు, బర్గర్లు కొనిపెట్టారని తేలింది. అంతటితో అతడికి సేవలు చేయటం అయిపోలేదు. బాలుడు మద్యం సేవించాడా? లేదా? అనే విషయాన్ని తెలుసుకొనేందుకు ఫోరెన్సిక్ అధికారులు పుణెలోని ససూన్ దవాఖానకు తీసుకెళ్లి నక్త నమూనాలు సేకరించారు. అయితే, వాటిని పరీక్షించి నివేదిక ఇవ్వాల్సిన వైద్యులు.. ఆ రక్త నమూనాలను చెత్తబుట్టలో పడేసినట్టు దర్యాప్తులో తేలింది. ఆ స్థానంలో మద్యం సేవించని వేరొక వ్యక్తి రక్త నమూనాలను పరీక్షించి, రక్తంలో మద్యం ఆనవాళ్లు లేవని పోలీసులకు నివేదిక ఇచ్చారు.
ఆరోజు ఏం జరిగిందంటే..
రోడ్డు ప్రమాదం 19వ తేదీ తెల్లవారుజామున జరగ్గా.. అదే రోజు ఉదయం 11 గంటలకు నిందితుడికి వైద్య పరీక్షల కోసం ససూన్ ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడ రక్త నమూనాలు సేకరించిన డాక్టర్ శ్రీహరి హల్నార్.. వాటిని చెత్తబుట్టలో వేసి వేరొక వ్యక్తి నమూనాలను పరీక్షించి పోలీసులకు నివేదిక ఇచ్చారు. అందులో మద్య ఆనవాళ్లు లేకపోవటంతో సందేహం వచ్చి దర్యాప్తు అధికారులు వేరొక దవాఖానలో కూడా బాలుడి రక్తనమూనాలు పరీక్షలు చేయించారు. దీంతో అతడి రక్తంలో మద్యం ఆనవాళ్లు ఉన్నట్టు తేలింది. అంతేకాదు రెండు దవాఖానల్లోని శాంపిళ్లకు డీఎన్‌ఏ పరీక్షలు చేయటంతో ప్రభుత్వ దవాఖానలో పరీక్షలు చేసిన రక్తం అసలు నిందితుడిదే కాదని వెల్లడైంది. దీంతో ఆదివారం రాత్రి డాక్టర్ శ్రీహరి హల్నార్‌ను అరెస్టు చేశారు. అతడిని విచారించగా, దవాఖాన ఫోరెన్సిక్ విభాగం హెచ్‌ఓడీ డాక్టర్ అజయ్ తావరే చెప్తేనే తాను శాంపిల్స్ మార్చేశానని చెప్పాడు. దీంతో హెచ్‌వోడీని కూడా అరెస్టు చేసినట్టు పుణె పోలీస్ కమిషనర్ అమితేశ్ కుమార్ సోమవారం వెల్లడించారు. వీరిపై నేరపూరిత కుట్ర, ఫోర్జరీ, సాక్ష్యాలను ధ్వంసం చేయటం తదితర సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు.






