10 July, 2026 | 3:43 AM

భారత్ జీడీపీ వృద్ధి 8 శాతంపైనే!

09-05-2024 12:02 AM

ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్

న్యూఢిల్లీ, మే 8: తాజాగా ముగిసిన 2023 ఆర్థిక సంవత్సరంలో భారత్ 8 శాతాన్ని మించి వృద్ధి రేటు సాధిస్తుందని కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ అంచనా వేశారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనామిక్ రీసెర్చ్ (ఎన్‌సీఏఈఆర్) బుధవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత 2024 ఆర్థిక సంవత్సరంలో 7 శాతంపైగా వృద్ధి రేటు కనపరుస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అయితే రానున్న నెలల్లో వర్షపాతం వృద్ధి అంచనాలకు కీలకమని తెలిపారు. భారత్ వచ్చే దశాబ్దకాలంపాటు నిలకడగా 6.5 శాతం వృద్ధి సాధిస్తుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. వ్యాపారాలపై ఉన్న నియంత్రణల భారాన్ని తగ్గించడం, యువత నైపుణ్యాల మెరుగుకు పెట్టుబడులు చేయడంపై భారత్ దృష్టిపెడితే వృద్ధి మరింత పెరుగుతుందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం రిజర్వ్‌బ్యాంక్ లక్ష్యమైన 4 శాతం స్థాయి వద్ద స్థిరపడుతుందని, భారీగా పెరిగే అవకాశాలు లేవని నాగేశ్వరన్ అంచనా వేశారు.