4 August, 2026 | 1:49 AM

ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ సమస్యలను పరిష్కరించాలి

04-08-2026 12:00 AM

జిల్లా కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు

ములుగు, ఆగస్టు 3 (విజయ క్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో అర్జీదారులు అందించిన దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు. సోమ వారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్  భోర్ఖడే హేమంత్ సహదేవరావు, జిల్లా అదనపు కలెక్టర్లు సి.హెచ్. మహేందర్ జీ, సంపత్ రావు లతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.

ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 67 దరఖాస్తులు రాగా వాటిలో భూ సమస్యలు 11, ఇందిరమ్మ ఇళ్లకు 18, పెన్షన్లకు 26, ఇతర శాఖలకు సంబంధించినవి 12 దరఖాస్తులు అందాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు పంపించడం జరిగిందని తెలిపారు. వచ్చిన దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి, సమస్యను పరిష్కరించాలని, ప్రజలకు జవాబుదారీతనంతో వ్యవహరించాలని అధికారులకు సూచించారు.

గతవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏదైనా కారణాలవల్ల క్రింది స్థాయి కార్యాలయాల్లో సమస్యను పరిష్కరించలేకపోతే, వాటికి సంబంధించిన పూర్తి వివరాలను ఫిర్యాదుదారునికి తెలియజేయాలని, పై స్థాయి కార్యాలయంలో ఏ అధికారికి, ఏ విధంగా తమ సమస్యను తెలియజేయాలో క్షుణ్ణంగా వివరించాలని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజావాణి దరఖాస్తులు అధికారుల వద్ద పెండింగ్లో ఉండకూడదని ఆదేశించారు.

ముఖ్యమంత్రి ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా నుంచి వచ్చిన దరఖాస్తులను కూడా అధిక ప్రాధాన్యత ఇస్తూ పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ కృష్ణవేణి, ఎస్డిటి ప్రతాప్ అన్ని శాఖల జిల్లా అధికారులు, అన్ని మండలాల ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.