12-11-2025 05:27:07 PM
మునుగోడు నియోజకవర్గ ఉద్యాన శాఖ అధికారి రావుల విద్యాసాగర్..
చండూరు (విజయక్రాంతి): ఆయిల్ ఫామ్ సాగుతో రైతులు అధిక లాభాలు పొందుతారని మునుగోడు నియోజకవర్గ శాఖ అధికారి రావుల విద్యాసాగర్ అన్నారు. చండూరు మండలం పుల్లెంల గ్రామంలో ఆయిల్ పామ్ పంటపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆయిల్ ఫామ్ సాగు ఒక్కసారి నాటితే 35 సంవత్సరాల పాటు ప్రతి నెల ఆదాయం వచ్చే ఏకైక పంట ఆయిల్ ఫామ్ అని అన్నారు. భారతదేశంలో జనాభా తగ్గట్టుగా ప్రతి ఒక్కరికి ఆహారం లో నిత్యవసరమైన నూనె పంట అని, ఇప్పటికే మన దేశానికి సరిపడా నూనె పంటల సాగు లేక ప్రతి సంవత్సరం సుమారు 80 వేల కోట్ల నుండి ఒక లక్ష వేల కోట్ల రూపాయలు ప్రతి ఏటా నూనె కోసం మనం ఖర్చు చేస్తున్నామని అన్నారు.
మునుగోడు నియోజకవర్గంలో ఆయిల్ పామ్ పంటపై దిగుబడులు ప్రారంభమైనవని, మన ప్రాంత నేలలు అనుకూలమని రైతులు ఆయిల్ ఫామ్ పంట వేయడానికి ముందుకు రావాలని, ప్రభుత్వం పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇస్తుందన్నారు. 200 రూపాయల విలువ గల మొక్కలను కేవలం 20 రూపాయలకే ఆయిల్ పామ్ మొక్కను ఇస్తున్నామని డ్రిప్ పరికరాలు కూడా ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, బీసీ రైతులకు 90 శాతం, ఓసి రైతులకు 80 శాతం రాయితీ ఇస్తుందని వారు తెలిపారు. ఆయిల్ పామ్ మొక్కలు పెంచినందుకు ఒక్కో ఎకరానికి 4200 రూపాయలను నాలుగు సంవత్సరాల పాటు ఇస్తున్నామని అన్నారు.
ఇప్పటికే చండూరు మండలంలో 85 మంది రైతులు 250 ఎకరాల ఆయిల్ పామ్ పంట సాగువుతుందని, మునుగోడు నియోజకవర్గంలో 16 ఎకరాలలో ఆయిల్ పామ్ పంట రైతులు సాగు చేస్తున్నారని అన్నారు. ఒక ఎకరం వరి సాగు అయ్యే నీటితో మూడు ఎకరాల వరకు ఆయిల్ పామ్ సాగు చేసుకోవచ్చని, ఆయిల్ పామ్ పంటపై ఎకరానికి లక్ష రూపాయల నుండి 1,50,000 వరకు నికర ఆదాయం వస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి చంద్రిక, పుల్లెంల క్లస్టర్ ఏ ఈ ఓ అనూష, ఎఫ్ ఎ సి ఎస్ చండూరు సీఈఓ అమరేందర్, చండూరు పతాంజలి ఆయిల్ పామ్ ఫీల్డ్ అసిస్టెంట్ మోహన్, హెచ్ ఇ ఓ శ్రీను, మనోహర్ రెడ్డి, వెంకటరెడ్డి, ఇర్గి బుచ్చయ్య, నరసింహ, నజీర్, అంజిరెడ్డి, రైతులు, తదితరులు పాల్గొన్నారు.