12 June, 2026 | 2:29 AM

ఆధునిక పద్ధతులతో అధిక లాభాలు

12-06-2026 12:45 AM
  1. పంటల మార్పిడి, సేంద్రియ సాగుపై దృష్టి
  2. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అనసూయ సీతక్క

ములుగు (మహబూబాబాద్) జూన్ 11 (విజయక్రాంతి): రైతులు సాగులో ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించి అధిక లాభాలు సాధించాలని, పంటల మార్పిడి, సేంద్రియ సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణా భివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క కోరారు. గురువారం గోవిందరావుపేట మండలం సోమలగడ్డ క్రాస్ వద్ద పీఎస్‌ఆర్ గార్డెన్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో, ఆత్మ సౌజన్యంతో  నిర్వహించిన జిల్లా స్థాయి మెగా రైతు మేళా కార్యక్రమానికి మంత్రి దనసరి అనసూయ సీతక్క, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రైతు అవగాహన సదస్సులో వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు పంటల మార్పిడి విధానం, నూతన వంగడాల వినియోగం, ఎరువుల వినియోగాన్ని తగ్గించే పద్ధతులు, సేంద్రియ వ్యవసాయం, వ్యవసాయంలో ఆధునిక యంత్రాల వినియోగం, తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించే శాస్త్రీయ సాగు విధానాలు, వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తదితర అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. రైతులు సంప్రదాయ సాగుతో పాటు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించి ఉత్పాదకతను పెంచుకోవాలని కోరారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, పంటల మార్పిడి ద్వారా భూసారాన్ని కాపాడుకుంటూ అధిక దిగుబడులు సాధించాలని పేర్కొన్నారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు అందిస్తున్న సాంకేతిక సూచనలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

వ్యవసాయ సాగులో అధిక రసాయనాలు ఉపయోగిస్తే అనేక అనర్థాలకు దారి తీస్తుంది సేంద్రియ వ్యవసాయాలతో ఆరోగ్యకర జీవనం సాధ్యపడుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, రుణమాఫీ ద్వారా రూ.21 వేల కోట్లను విడుదల చేసి దేశంలోనే అతిపెద్ద రైతు రుణమాఫీ చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. రైతు భరోసాతో పాటు క్వింటాలుకు రూ.500 బోనస్ అందిస్తున్నామని, రైతుల పంటను కొనుగోలు చేయడంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

ములుగు జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తరిస్తుండటం సంతోషకరమని పేర్కొన్నారు. జిల్లాలో తొలి దశలో ప్రారంభమైన ఆయిల్ పామ్ సాగు ప్రస్తుతం వేలాది ఎకరాలకు విస్తరించిందని, తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం అందించే పంటగా రైతులు దీనిని స్వీకరించాలని సూచించారు. పోడు, బీడు భూముల్లో కూడా ఆయిల్ పామ్తో పాటు ప్రత్యామ్నాయ వాణిజ్య పంటలను సాగు చేసి ఆదాయం పెంచుకోవాలని కోరారు. వ్యవసాయ భూములు ఉన్నప్పటికీ పట్టాలు లేని రైతులకు కూడా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామ ని వెల్లడించారు.

విత్తనాలు, ఎరువులు, పం ట కొనుగోలు వంటి అంశాల్లో ఎలాంటి వి వక్ష లేకుండా రైతులకు సహకారం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతులకు ప్రజా ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఆయిల్ ఫెడ్ చైర్మ న్ జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో సాంకేతికత వినియోగం ద్వారా ఖర్చులు తగ్గించడంతో పాటు ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటలను సాగు చేయడంతో పాటు ప్రభుత్వ పథకాలను రైతులు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు మాట్లాడుతూ రైతులకు శాస్త్రీయ సాగు పద్ధతులపై అవగాహన కల్పించడంలో మెగా రైతు మేళాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ రైతులను సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యవసాయ శాస్త్రవేత్తలు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేష్, ఉద్యానవన శాఖ అధికారి సంజీవరావు,జిల్లా అధికారులు,ములుగు,ఏటూరు నాగారం ఆత్మ కమిటీ చైమెన్లు రవీందర్ రెడ్డి, కర్ల అరుణ, చల్వాయి, గోవిందరావు పేట గ్రామాల సర్పంచ్ లు,సంబధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.