ఆధునిక వ్యవసాయ పద్ధతులతో అధిక దిగుబడులు సాధించాలి
కలెక్టర్ అంకిత్
భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 23, (విజయక్రాంతి): జిల్లా రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించి పంటల దిగుబడులను గణనీయంగా పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ అంకిత్ పిలుపునిచ్చారు. సోమవారం రామవరం కృషి విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) ఆధ్వర్యంలో నిర్వహించిన కిసాన్ మేళా , వ్యవసాయ ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గాలికుంట వ్యాధి నివారణకు సంబంధించి నిర్వహిస్తున్న జాతీయ ఉచిత టీకాల కార్యక్రమంపై అవగాహన కల్పించే గోడపత్రికలను కలెక్టర్ ఆవిష్కరించారు.
అనంతరం జెండా ఊపి టీకాల కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. రైతులకు అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పద్ధతులు, నాణ్యమైన విత్తనాల వినియోగం, పంటల నిర్వహణ విధానాలు, వ్యవసాయ యంత్రాల వినియోగం, పంట రక్షణ చర్యలు, నీటి సంరక్షణ పద్ధతులపై ఏర్పాటు చేసిన ప్రదర్శనలను ఆసక్తిగా వీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మారుతున్న వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాలు, వడగళ్ల వానలు వంటి సవాళ్లను దృష్టిలో ఉంచుకుని రైతులు శాస్త్రీయ ,ఆధునిక పద్ధతులను అనుసరించడం అత్యవసరమని పేర్కొన్నారు.
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గణేష్, డిప్యూటీ మేయర్ సిరిపురం లలిత, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, ఉద్యానవన శాఖ అధికారి కిషోర్, మత్స్య శాఖ అధికారి ఇంతియాజ్ ఖాన్, త్రీ ఇంక్లైన్ సర్పంచ్ ఈసం ప్రవల్లిక, కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ భరత్, ఆత్మ చైర్మన్లు వీరభద్ర రావు, బుచ్చిబాబు, బోడా మంగీలాల్, శాస్త్రవేత్తలు, తహసీల్దార్, ఎంపీడీవో, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




