కల్వకుర్తిలో అభివృద్ధి పనులపై కలెక్టర్ తనిఖీ
కల్వకుర్తి: నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్(Collector Hemanta Keshav Patil) గురువారం కల్వకుర్తి పట్టణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, వరి కొనుగోలు కేంద్రం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఆకస్మికంగా పరిశీలించారు. ఎస్సీ కార్పొరేషన్ షాపింగ్ కాంప్లెక్స్, 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, క్యాటిల్ మార్కెట్‌ను సందర్శించిన అనంతరం పనులను నాణ్యతతో, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
రైతులకు ఇబ్బందులు లేకుండా వరి కొనుగోళ్లు వేగవంతంగా నిర్వహించి, సకాలంలో చెల్లింపులు చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్, లబ్ధిదారులకు అవసరమైన సహకారం అందిస్తూ నాణ్యత ప్రమాణాలతో ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత, పారదర్శకత, జవాబుదారీతనం తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు.






