టీ 20 క్రికెట్ పోటీల్లో పరుగుల వరద కురిపించిన హిమతేజ
క్రికెట్ పోటీల్లో సత్తా చాటిన ఆదిలాబాద్ యువకుడు....
ఆదిలాబాద్, జూలై 6 (విజయక్రాంతి) : హైదరాబాద్ లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న టీ 20 క్రికెట్ పోటీల్లో ఆదిలాబాద్ కు చెందిన యువ క్రికెటర్ కొడిమెల హిమతేజ పరుగుల వరద కురిపించారు. సోమవారం మెదక్, ఖమ్మం జట్ల మధ్య జరిగిన హోరాహోరీ పోరులో తన అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో ప్రత్యర్థులకు ముచ్చమటలు పట్టించారు. ఈ మ్యాచ్ లో 57 బంతుల్లో 103 పరుగులు చేసి నాటౌట్ గా నిలవడంతో పాటు అతి తక్కువ సమయంలో సెంచరీ సాధించిన క్రికెటర్ గా ఘనత సాధించారు.
20 ఓవర్ల మ్యాచ్ ల్లో 4 సిక్స్ లు, 11 ఫోర్లతో క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించారు. అభిమానులు కేరింతలు... జయ జయ ద్వానాలతో స్టేడియం మారుమ్రోగింది. కాగా జూన్ 21న ప్రారంభమైన లీగ్ మ్యాచ్లలో ఇప్పటి వరకు జరిగిన ఏడు మ్యాచ్లలో హిమతేజ 430 పరుగులు సాధించాడు. ఇందుకు గాను సోమవారం పోటీల నిర్వాహకులకు ఆయనకు ఆరేంజ్ క్యాప్ ను బహుకరించారు. మరోవైపు ఆదిలాబాద్ లో క్రికెట్ అభిమానులు సోమవారం ఆయన మ్యాచ్ ను ఆసక్తిగా తిలకించారు.
ఆయన అద్భుతమైన ఆటతీరును పలువురు ప్రశంసించారు. అటు కుటుంబీకుల్లోనూ ఆనందం వెల్లివిరిసింది. పట్టణానికి చెందిన యువకుడు లీగ్ మ్యాచ్లలో సత్తాను చాటడం క్రికెట్ అభిమానులతో పాటు స్థానికుల్లోనూ ఆనందం వ్యక్తమవుతోంది.






