6 July, 2026 | 10:37 PM

రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ భద్రాద్రి జిల్లా పర్యటన

06-07-2026 09:56 PM

పోలీస్ స్టేషన్, పలు నివాస గృహలు ప్రారంభం

06వ బెటాలియన్ సందర్శించిన డిజిపి

పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం

కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్  సి.వి. ఆనంద్ ఐపీఎస్‌, జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, జిల్లా పోలీసు అధికారులు పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్ర డీజీపీతో పాటు  మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ ఐపీఎస్‌ కు జిల్లా ఎస్పీ స్వాగతం పలికారు. అనంతరం మణుగూరులో  నిర్మించిన పోలీస్ స్టేషన్‌ను, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏఆర్ డీఎస్పీ నివాస గృహాన్ని, హేమచంద్రపురం పోలీస్ గెస్ట్ హౌస్ ని  ప్రారంభించారు. అనంతరం 6వ బెటాలియన్‌ను సందర్శించారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించి, మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.

 రెస్క్యూ పరికరాలను పరిశీలించి, విపత్తు నిర్వహణలో సిబ్బంది ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని సూచించారు. జిల్లా పోలీసు అధికారులతో,రాష్ట్ర డీజీపీ సమీక్ష సమావేశం నిర్వహించారు. సైబర్, మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రతి ఒక్కరూ వాటి నిర్మూలనకై కృషి చేయాలని, విద్యాసంస్థలు, యువతలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. రౌడీషీటర్లు, పాత నేరస్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచి, నేర నియంత్రణకు సీసీటీవీ కెమెరాల ఏర్పాటుపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి, ప్రధాన కూడళ్లలో  సీసీటీవీ కెమెరాల ఏర్పాటు కు అధికారులను ఆదేశించారు.

మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల పట్ల సున్నితంగా స్పందిస్తూ, ప్రతి ఫిర్యాదుపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ అమలు మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. కమ్యూనిటీ పోలీసింగ్‌కు మరింత ప్రాధాన్యత ఇస్తూ ప్రజలతో సత్సంబంధాలు,నిరంతరం మమేకమై వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని తెలిపారు. సీసీటీఎన్ఎస్ 2.0  సమర్థవంతంగా వినియోగించుకొని సమాచారాన్ని పొందుపరచాలని సూచనలు చేశారు.

ఇండస్ట్రియల్ దొంగతనాలు పట్ల ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి నేరాల దర్యాప్తు నాణ్యతను మరింత మెరుగుపరచాలని సూచించారు. జిల్లాలో పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, నేరస్తులకు చట్టపరంగా శిక్షలు పడేలా పటిష్టమైన దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో   మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్,జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఈగల్ ఫోర్స్ ఎస్పీ గిరిధర్,డీఎస్పీలు, సీఐలు, జిల్లా పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.