ట్రాక్టర్ చోరీ కేసులో నిందితుడు అరెస్టు
హుజూర్ నగర్,(విజయక్రాంతి): మండల పరిధిలోని అమరవరం గ్రామంలో ఇటీవల చోటు చేసుకున్న ట్రాక్టర్ చోరీ కేసును హుజూర్ నగర్ పోలీసులు ట్రాక్టర్ చోరీకేసును చేదించారు. నిందితుడిని సోమవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పట్టణంలోని సీఐ కార్యాలయంలో సీఐ చరమంద రాజు విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. గత నెల 29న హుజూర్ నగర్ మండల పరిధిలోని అమరవరం గ్రామంలోని కొప్పుల వాసిరెడ్డి తన ఇంటి ఆవరణలో నిలిపించిన జాన్డీర్ ట్రాక్టర్ ను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. దీన్ని గమనించిన ట్రాక్టర్ యజమాని వాసిరెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
బాధితుడు ఫిర్యాదుపై వెంటనే కేసు నమోదు చేసిన హుజూర్ నగర్ ఎస్ఐ చలికంటి నరేష్ దర్యాప్తు ప్రారంభించారు.చోరీకి గురైన ట్రాక్టర్ మఠంపల్లి మండలం అవిరేణి కుంట సమీపంలో గుర్తించారు. దీంతో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేయగా అదే గ్రామానికి చెందిన చిరంజీవి అనే వ్యక్తి ట్రాక్టర్ ను దొంగిలించినట్టు గుర్తించి అరెస్టు చేసి కోర్టులో రిమాండ్ చేసినట్లు తెలిపారు. అనంతరం సీఐ చరమంద రాజు మాట్లాడుతూ... వరి నాట్ల సీజన్ ప్రారంభమైన సందర్భంగా ట్రాక్టర్ ఇంజన్, వ్యవసాయ సంబంధిత పరికరాలను వ్యవసాయ పొలంలోనే వదిలివేయకుండా భద్రపరుచుకోవాలని రైతులకు సూచించారు.కార్యక్రమంలో సిబ్బంది జానీ,గోలి శంభయ్య, పాల్గొన్నారు.






