7 July, 2026 | 1:22 AM

‘పాలకూర్ల’కు కార్పొరేషన్ పీఠం దక్కేనా?

07-07-2026 12:47 AM
  1. కష్టకాలంలో జెండా మోసిన నేత ఎదురుచూపులు
  2. బీఆర్‌ఎస్ వేధింపులకు లొంగని యువనేత నేత 
  3. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీపైనే ఆశలు 
  4. 40 ఏళ్ల కుటుంబ విధేయత.. క్షేత్రస్థాయి పోరాటాలకు  దక్కేనా సముచిత స్థానం?

రంగారెడ్డి, జులై 6 (విజయక్రాంతి): తెలంగాణలో పదేళ్లపాటు కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసం, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీ జెండాను నిలబెట్టడం కోసం లాఠీ దెబ్బలకు భయపడకుండా.. నాటి అధికార పార్టీ బెదిరింపులకు లొంగకుండా అహర్నిశలు శ్రమిం చిన కల్వకుర్తి గడ్డ యువ కిరణం, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పాలకూర్ల రవికాంత్ గౌడ్. కష్టకాలంలో పార్టీకి వెన్నంటి ఉండి, నేడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో తనవంతు క్రియాశీలక పాత్ర పోషించిన ఈ యువ నాయకుడికి ఈ దఫా నామినేటెడ్ పదవి వరిస్తుందా లేదా అనేది ఇప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని యూత్ కాంగ్రెస్ శ్రేణుల్లో హాట్ టాపిక్గా మారింది.

40 ఏళ్ల కాంగ్రెస్ విధేయత.. అంచెలంచెలుగా ఎదిగిన నాయకత్వం..

పాలకూర్ల రవికాంత్ గౌడ్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీతో దశాబ్దాల అనుబంధం ఉంది. ఆయన తండ్రి, కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని ఉమ్మడి ఆమనగల్లు మం డలం ఎక్వాయిపల్లి గ్రామానికి చెందిన దివంగత మాజీ ఎంపీపీ బుగ్గయ్య గౌడ్ కుటుంబం దాదాపు 40 సంవత్సరాల పాటు కాంగ్రెస్ జెండా ను భుజాన మోశారు. ఎక్వాయిపల్లి గ్రామ సర్పంచి మొదలు కొని, ఎంపీటీసీ, ఎంపీపీగా ఉమ్మ డి ఆమనగల్లు మండలంలో ప్రజల మనసులో ఆయన చెరగని ముద్ర వేశారు.

రాష్ట్ర గౌడ సంఘంలోనూ ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు. దివంగత కేంద్ర మంత్రి సూదిని జైపాల్ రెడ్డి ముఖ్య శిష్యుడిగా.. సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి, మంత్రి జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఏఐసీసీ నేత వంశీచందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిలతో బుగ్గయ్య గౌడ్ కుటుంబానికి అత్యంత సత్సంబంధాలు ఉన్నాయి.

విద్యార్థి ఉద్యమాల నుంచి.. యూత్ కాంగ్రెస్ వరకు..

తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ, విద్యార్థి దశ నుంచే రవికాంత్ గౌడ్ కాంగ్రెస్ సిద్ధాంతాల వైపు ఆకర్షితులయ్యారు. ఎన్‌ఎస్యూఐ విద్యార్థి సంఘంలో సాధారణ కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించి.. హైదరాబాద్ సిటీ సెక్రటరీగా, ఆ తర్వాత రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటూ, విద్యార్థుల సమస్యలపై అప్పటి ప్రభుత్వాలపై రాజీలేని పోరాటాలు చేశారు. ఆ తర్వాత యూత్ కాంగ్రెస్ కల్వకుర్తి వైస్ ప్రెసిడెంట్గా, రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రస్తుతం రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా అంచెలంచెలుగా ఎదుగుతూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

’జంగ్ సైరన్’ నుంచి ’భారత్ జోడో’ దాకా.. రేవంత్కు నమ్మకమైన సైనికుడు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో.. ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి పీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రతి పిలుపును రవికాంత్ గౌడ్ జనంలోకి తీసుకెళ్లారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో పాటు కల్వకుర్తి నియోజకవర్గంలో యువతను ఏకం చేసి ’జంగ్‌సైరన్’ ఊదారు. రాహుల్ గాంధీ చేపట్టిన చారిత్రాత్మక ‘భారత్ జోడో యాత్ర’లో ఉమ్మడి జిల్లా నుంచి యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్యూఐ శ్రేణులను భారీ ఎత్తున సమీకరించి యాత్ర విజయవంతంలో ఆయన కీలక పాత్ర పోషించారు. పార్టీ పిలుపునిచ్చిన ప్రతి ధర్నా, ఆందోళన కార్యక్రమాల్లో ముందుండి పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నారు, కేసులను సైతం లెక్కచేయకుండా కాంగ్రెస్ పటిష్టత కోసం కష్టపడ్డారు.

త్యాగానికి ప్రతిఫలం దక్కేనా?.. రేవంతన్న మాట నిలబడేనా?

2023 అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి బీసీ సామాజికవర్గం కోటాలో ఎమ్మెల్యే టికెట్ కోసం రవికాంత్ గౌడ్ గట్టి ప్రయత్నమే చేశారు. నియోజకవర్గంలో బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ, అప్పటి రాజకీయ సమీకరణాలు మరియు పార్టీ అంతర్గత వ్యూహాల కారణంగా ఆయనకు టికెట్ కేటాయించడం సాధ్యపడలేదు. అయినప్పటికీ, అధిష్ఠానం నిర్ణయాన్ని శిరసావ హించి, పార్టీ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి విజయం కోసం రవికాంత్ తన శక్తివంచన లేకుండా శ్రమించి కాంగ్రెస్ జెండాను ఎగరేశారు.

తంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో, ప్రస్తుత ముఖ్యమంత్రి హోదా లో ఉన్న రేవంత్ రెడ్డి సైతం.. కష్టకాలంలో పార్టీ కోసం పని చేసిన రవికాంత్ గౌడ్ సేవలను గుర్తించి, భవిష్యత్తులో కార్పొరేషన్ పదవుల్లో సముచిత స్థానం కల్పిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు.

సెకండ్ లిస్టుపైనే ఆశలు..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే మొదటి విడతలో కొందరు సీనియర్లకు కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం లభించింది. అయితే, క్షేత్రస్థాయిలో లాఠీ దెబ్బలు తిని పార్టీని నిలబెట్టిన ద్వితీయ శ్రేణి, యువజన నాయకులకు ఇంకా చాలా మందికి పదవులు దక్కలేదు. ప్రస్తుతం రెండో విడత నామినేటెడ్ పోస్టుల భర్తీకి కసరత్తు జరుగుతుండటంతో ఆశావహుల ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.

తమ కుటుంబానికి ఉన్న 40 ఏళ్ల విధేయతను, 10 ఏళ్లుగా తాను చేసిన పోరాటాలను, ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ ని పరిగణనలోకి తీసుకుని, ఈ దఫా కార్పొరేషన్ పదవుల్లో తనకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని పాలకూర్ల రవికాంత్ గౌడ్ గట్టి ఆశాభావంతో ఉన్నారు. కష్టపడిన కార్యకర్తలకు, యువ నాయకులకు గుర్తింపు ఇస్తేనే భవిష్యత్తులో పార్టీ మరింత బలోపేతం అవుతుందని, రవికాంత్ గౌడ్ లాంటి కష్టపడే తత్వమున్న యువ నాయకుడికి ఈసారి సముచిత స్థానం దక్కాలని కల్వకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు మరియు యువజన కాంగ్రెస్ నాయకులు అధిష్ఠానాన్ని గట్టిగా కోరుతున్నారు.