4 March, 2026 | 3:47 AM

లోక్యతండాలో హోలీ వేడుకలు

04-03-2026 12:00 AM
  1. కోలాటమాడిన గిరిజనం, అంబరాన్నంటిన హోలీ సంబురం

రాష్ట్ర నలుమూలల నుంచి వేలాధిగా తరలివచ్చిన బంజార బిడ్డలు

కూసుమంచి, మార్చి 3 (విజయక్రాంతి): కూసుమంచి మండలంలోని లోక్యతండా గ్రామంలో ‘హోలీ’ సంబురాలు అంబురాన్నంటాయి.. యువకుల కేరింతలు.. పెద్దల కౌగిలింతలు.. మహిళల చప్పట్లు.. కర్ర,చిర్రలతో కోలాటం.. చిన్నారుల ఆట పాటలతో లోక్యతండా మురిచిపోయింది.. వేలాధి మంది గిరిజనం సమక్షంలో జరిగిన హోలీ వేడుకలు ఆనందోత్సవాల నడుమ జరుగుతున్నాయి..

లోక్యతండాలో ‘హోలీ’ పండుగ వేడుకలు ప్రారంభమైయ్యాయి.. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలను మంగళవారం సాయంత్రం లోక్యతండా బస్టాండ్ పంచాయతీ కార్యాలయ సెంటర్ లో కుల పెద్దలు హోలీ వేడుకలను ప్రారంభించారు. కుల పెద్ద గేరియా వడ్తియా సక్రు, ఖారాబారో వడ్తియా రవి తో పాటు సర్పంచ్, ఉపసర్పంచ్, కుల పెద్దలు డప్పులను కొట్టి గిరిజన సంస్కతి సంప్రధాయ ప్రకారం పాటలు పాడుతూ హోలీ వేడుకలను ప్రారంభించారు. 

కోలాటమాడిన వందలాధి మంది బంజారులు..

లోక్యతండాలో హోలీ పండుగ సందర్భంగా కోలాట కార్యక్రమాన్ని నిర్వహించారు. తండాలోని మగవారు, యువకులు అందరు చిర్రలతో కోలాటం ఆడారు. చక్కని గిరిజన సంస్కతి సంప్రధాయ పద్దతిలో డ్రస్సులను వేసుకున్న బంజారులు కోలాటమాడుతూ పాటలు పాడుతూ సందడి చేశారు. యువకులు చెర్రా అంటూ కేరింతలు కొడుతూ సందడి చేశారు. ఈ కోలాటం చూసేందుకు  రాష్ట్ర నలుమూలల నుంచి బంజార బిడ్డలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మహిళలు చప్పట్లు వేస్తూ పాటలు పాడుతూ సందడి చేశారు.

అనంతరం మహిళలు, యువతులు కుల పెద్ద గేరియా, ఖారోబారో ఆశీర్వాదం పొందారు. అనంతరం కూసుమంచి మండలంలోని జగ్మల్ తండాలో బంజారులు హోలీ సంబరాలను ప్రారంభించారు. వైఎస్‌ఆర్ విగ్రహం వద్ద కూడలిలో బంజారులు కోలాటమాడారు. యువకులు ఆటపాటలతో సందడి చేశారు. సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 7గంటల వరకు సుమారు మూడు గంటల పాటు కోలాట కార్యక్రమం జరిగింది. 

నేడు కామదాహనం.. డూండ్..

హోలీ సంబరాల్లో భాగంగా మొదటి రోజు కోలాట కార్యక్రమం జరిగింది. రెండవ రోజు తెల్లవారు జామున కామదాహనం కార్యక్రమం ఉంటుంది. ఉదయం 10గంటలకు ఢూండ్ కార్యక్రమం జరుగుతుందని లోక్యతండా గ్రామ పెద్దలు తెలిపారు. కామదాహనంకు ఊరుఊరంతా కదిలి వస్తుందని తెలిపారు. అలాగే ఢూండ్ కార్యక్రమంలో భాగంగా గతేడాది హోలీ నుంచి ఇఫ్పుడు హోలీ వరకు గ్రామంలో మగ బిడ్డ పుట్టిన ఇంట్లో ఢూండ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మగబిడ్డలకు నామకరణం చేస్తారని గ్రామ పెద్దలు తెలిపారు.