చేప పిల్లల పంపిణీకి టెండర్లు వద్దు
- మత్స్యకార సోసైటీల ఖాతాల్లోనే నగదు జమ చేయాలి
- నాణ్యతలేని చేప పిల్లలను వదులుతున్న కాంట్రాక్టర్లు
- 100 నుంచి 200 గ్రాముల సైజు కంటే ఎక్కువగా పెరగడం లేదు
- ప్రభుత్వానికి మత్స్యకార సోసైటీల విజ్ఞప్తి
హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): రాష్ట్రంలోని చెరువులు, రిజర్వాయర్లలో ఉచిత చేపలు, రొయ్యల పంపిణీకి ప్రభుత్వం టెండర్లను ఆహ్వానిస్తోంది. 90 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లల కొనుగోలుకు ఈనెల 5 లేదా 6 వ తేదీల్లో టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి, సెప్టెంబర్ మొదటి వారంలో చెరువుల్లో వదలాలని మత్స్యశాఖ నిర్ణయించింది. అందుకు ప్రభుత్వం రూ.116 కోట్లను విడుదల చేసింది. మరో రూ.18.94 కోట్లు టెండర్ల తర్వాత విడుదల చేస్తామని ప్రకటించింది.
గతేడాది మాదిరిగానే జిల్లాస్థాయిల్లో టెండర్ల ప్రక్రియను చేపట్టనున్నారు. అయితే ఈ ఉచిత చేప, రొయ్యపిల్లల పంపిణీని కాంట్రాక్టర్లకు కాకుండా మత్స్యకార సోసైటీల ఖాతాల్లోనే నగదు జమచేయాలని మత్స్యకార సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ‘గత 11 సంవత్సరాలుగా ప్రభుత్వాలు ఉచితంగా వేస్తున్న చేపపిల్లలు ఇప్పటికీ 100, 200 గ్రాముల కంటే ఎక్కువ సైజు పెరగడంలేదు.
నాసిరకం చేప పిల్లలు ఇవ్వడం వల్ల బ్రోకర్లు, కాంట్రాక్టర్లు, కొంతమంది మత్స్యశాఖ అధికారుల జేబులు నిండుతున్నాయని సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు గోరెంకల నర్సింహా, లెల్లెల బాలకృష్ణ ఆరోపించారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వెలికితీసి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పిన కాంగ్రెస్ అదే బాటలో నడుస్తున్నదని విమర్శించారు. చేపపిల్లల స్కీమ్‌లో అవినీతికి పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నేరుగా మత్స్య సొసైటీల ఖాతాల్లోనే నగదు జమ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాగా రాష్ట్రంలో 6 వేల వరకు మత్స్యకార సోసైటీలు ఉండగా, 12 లక్షల మత్స్యకార కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. మత్స్యకార కుటుంబాల జీవనోపాధికి గాను 2016 నుంచి ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. రాష్ట్రంలో 77 భారీ రిజర్వాయర్లు, 4,647 మత్స్యశాఖ చెరువులు, 19,465 చిన్న నీటి వనరుల్లో చేపలు, రొయ్యలు పెంచుతున్నారు.
ఏటా జూన్, జులై నెలల్లోనే టెండర్లు పిలుస్తుండగా, ఈసారి ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాలు సరిగా లేక చెరువులు, కుంటలు, జలశాయాల్లోకి తగిననీరు రాకపోవడంతో పథకం అమలుపై సందిగ్ధం నెలకొన్నది. గత కొన్ని రోజుల నుంచి వర్షాలు కురిసి.. చెరువులు, కుంటల్లోకి నీరు చేరడంతో ఉచిత చేపలు, రొయ్య పిల్లల పంపిణికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.






