నరం నరం.. గరం గరం
పట్టరాని కోపంతో లోపలంతా గరం గరంగా ఉంది. పట్టు బిగించేందుకు నర నరాల్లో బిగువూ ఉంది. అయితే దానిని ప్రకటించేందుకు ఒక నియమం కూడా ఉంది. అది ఎందుకన్నది తెలియాలంటే ‘సరిపోదా శనివారం’ సినిమా విడుదల వరకు ఆగాల్సిందే. నాని కథానాయకుడిగా వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. భిన్నమైన యాక్షన్ చిత్రంగా ముస్తాబవుతున్న ఈ సినిమా నుంచి తాజాగా “గరం.. గరం..” అంటూ సాగే ఓ గీతం విడుదలైంది. హీరో పాత్రని గురించి తెలుపుతూ సాగే ఈ పాటకి సానపాటి భరద్వాజ పాత్రుడు సాహిత్యం సమకూర్చగా, విశాల్ దడ్లాని గాత్రమందించారు. జేక్స్ బిజోయ్ స్వరపరిచిన ఈ గీతంతో సినిమా సంగీత సంబరాలు మొదలయ్యాయి. పాన్ ఇండియా సినిమాగా డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్న ‘సరిపోదా శనివారం’ సినిమా ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.






