అప్పుడు ఎంతకైనా తెగిస్తాం
బాలీవుడ్ స్టార్ కథానాయిక ఆలియా భట్ ప్రస్తుతం వాసన్ బాలా దర్శకత్వంలో ‘జిగ్రా’ అనే సినిమాలో నటిస్తోంది. లేడీ ఓరియెంటెడ్ కాన్సెఫ్ట్‌తో తెరకెక్కుతున్న చిత్రమిది. దీంట్లో వేదాంత్ రైనా, ఆలియా భట్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ ‘జిగ్రా’ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాను మొదట సెప్టెంబర్ 27న విడుదల చేయాలని భావించినప్పటికీ, చిత్ర నిర్మాణ సంస్థ తన నిర్ణయాన్ని మార్చుకుంది. సినిమా విడుదల తేదీ మారిన విషయాన్ని ఆలియా భట్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
ముందుగా ప్రకటించిన తేదీకి రావటంలేదని, అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని పేర్కొంది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను అప్‌లోడ్ చేసిందీ భామ. ఆ పోస్టర్‌కు ఈ ముద్దుగుమ్మ పెట్టిన క్యాప్షన్ ఆసక్తిని రేకెత్తించేలా ఉంది. ‘మనకు దగ్గరైనవాళ్లు ప్రమాదంలో ఉన్నప్పుడు కచ్చితంగా మనకు ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంతోనే మనం వాళ్లను కాపాడేందుకు ఎంతకైనా తెగిస్తాం’ అని రాసి ఉన్న క్యాప్షన్ ‘జిగ్రా’ సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది.
ప్రమాదంలో ఉన్న ఒక సోదరి కోసం అమాయకుడైన సోదరుడు చేసే పోరాటలను ఈ సినిమాలో చూపించబోతున్నారని సమాచారం. ఈ సినిమాలో వేదాంత్ రైనా ఆలియా భట్‌కు తమ్ముడిగా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఆలియాభట్‌కు సంబంధించి టాలీవుడ్ విషయానికొస్తే.. ఆమె ‘ఆర్‌ఆర్‌ఆర్’లో నటించింది. ఇప్పటికైతే ఆమె చేతిలో తెలుగు సినిమాలేమీ లేవు. ప్రస్తుతానికి ఈ అమ్మడు హిందీ, ఇంగ్లిష్ సినిమాలపైనే దృష్టి పెట్టిందని సన్నిహితులు అంటున్నారు.






