స్టార్ డామినేషన్ తప్పు కాదు!
వివేక్ ఒబెరాయ్, సూర్య, రాధికా ఆప్టే, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రక్త చరిత్ర’. సెన్సేషనల్ డైరెక్టర్ రామ్‌గోపాల్‌వర్మ రూపొందించిన ఈ సినిమా 2010లో విడుదలై, ప్రేక్షకాదరణ పొందింది. ఈ సంచలన చిత్రం మళ్లీ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. త్రిపుర క్రియేషన్స్, నట్టీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, క్విటీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ల ద్వారా మురళీకృష్ణ వంకాయలపాటి, నట్టి కుమార్ రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పాత్రికేయుల నుంచి ఎదురైన పలు ప్రశ్నలకు రామ్‌గోపాల్ వర్మ తనదైన రీతిలో సమాధానాలిచ్చారు.
“రక్త చరిత్ర’ను రెండోభాగాలుగా తెరకెక్కించాం. పార్ట్-3 తీసే అవకాశం లేదు. ఎందుకంటే పార్ట్-2లోనే వాళ్లందరూ పోయారు. ఇప్పుడున్నవాళ్లు సోషల్ మీడియాలో మాటలు తూటాలుగా పేల్చినా, బయటకు వచ్చి, బాహాబాహీ తలపడే దమ్ము ఎవరికీ లేదు” అంటూ వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు డైరెక్టర్‌ను కెప్టెన్ ఆఫ్ ది షిప్‌గా భావించిన సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు స్టార్ డామినేషన్ ఎక్కువైందన్న ప్రశ్నకు వర్మ బదులిస్తూ.. ‘డైరెక్టర్‌కు ఏమైనా కిరీటం ఉంటుందా?! స్టార్ ముఖం చూసి ప్రేక్షకులు టిక్కెట్లు కొంటున్నప్పుడు స్టార్ డామినేషన్‌లో తప్పు లేదు.
అది కరెక్ట్ కూడా’ అని చెప్పారు. ఆర్జీవీ ఇంకా మాట్లాడుతూ.. ‘ఒక కుటుంబం థియేటర్‌కు వెళితే.. భర్త హీరోయిన్‌ను చూస్తాడు, భార్య హీరోయిన్ కాస్ట్యూమ్స్‌ను చూస్తుంది. ఇక కొడుకు బోరింగ్‌గా ఫీల్ అవుతాడు. అందుకే ఫ్యామిలీ సెంటిమెంట్ సబ్జెక్టుల జోలికి వెళ్లదలచుకోలేదు. భారీ కాస్ట్యూమ్స్, బోలెడంత గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది కాబట్టి పౌరాణిక సినిమాల ఎప్పటికీ ఆలోచించను. రియలిస్టిక్ డ్రామాలే తీస్తా. ప్రస్తుతం హిందీలో కాప్స్ స్టోరీతో సినిమా చేస్తున్నా’ అని తెలిపారు. ఈ సమావేశంలో నిర్మాతలు నట్టి కుమార్, మురళీకృష్ణ మాట్లాడుతూ.. ఈ సినిమాను అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు.






