24 June, 2026 | 8:38 PM

ఇండ్లకు పగుళ్లు ఎలా వచ్చాయ్?

14-06-2024 01:45 AM

సింగరేణి అధికారులపై కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆగ్రహం

జయశంకర్ భూపాలపల్లి, జూన్ 13 (విజయక్రాంతి): ‘మీరు బ్లాస్టింగ్ చేయకపోతే ఇండ్లకు పగుళ్లు ఎలా వస్తున్నాయ్.. ఇండ్ల యజమానాలకు దీనిపై ఏం సమాధానం చెప్తారు’ అంటూ కలెక్టర్ భవేష్ మిశ్రా సింగరేణి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భూపాలపల్లి జిల్లా గుర్రంపేట ఎస్సీ కాలనీలో గురువారం ఆయన విస్తృతంగా పర్యటించారు. బ్లాస్టింగ్ కారణంగా దెబ్బతిన్న ఇండ్లను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భం స్థానికులు కలెక్టర్‌కు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. సింగరేణి ఓపెన్ కాస్ట్ బ్లాస్టింగ్ కారణంగా తమ ఇంటిపై రాళ్లు పడుతున్నాయని, గోడలకు పగుళ్లు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై సింగరేణి అధికారులు స్పందిస్తూ బ్లాస్టింగ్ ప్రభావం కాలనీలో లేదని, డేంజర్ మార్క్‌కు అవతలే బ్లాస్టింగ్ చేస్తున్నామని సమాధానమిచ్చారు. దీంతో కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బ్లాస్టింగ్‌తో జరుగుతున్న నష్టాన్ని అధికారులతో అంచనా వేయించి, సింగరేణి ద్వారా నష్టపరిహారం అందిస్తామని కలెక్టర్ బాధితులకు హామీ ఇచ్చారు.