05-07-2025 01:00:42 AM
మహబూబాబాద్, జూలై 4 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రైల్వే ట్రాక్ కు ఇరువైపులా విస్తరించి ఉన్న పట్టణ ప్రజలు రైల్వే ట్రాక్ దాటడం కష్టంగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో డివిజన్ కేంద్రంగా ఉన్న మహబూబాబాద్ పట్టణ మధ్య నుంచి కాజీపేట - విజయవాడ రైల్వే ట్రాక్ ఉంది. రైల్వే ట్రాక్ దాటేందుకు రెండు చోట్ల రైల్వే గేట్లు ఉండేవి. రైల్వే గేట్లు గంటల తరబడి మూసి ఉండటం వల్ల రాకపోకలకు ఆటంకంగా మారడంతో, 2004లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించారు.
అయితే ఫ్లై ఓవర్ బ్రిడ్జి పైన ఎక్స్పెన్షన్ జాయింట్ కోసం ఏర్పాటుచేసిన రబ్బరు పూర్తిగా పాడైపోయి అడుగడుగునా వాహనాల రాకపోకలకు ఆటంకంగా మారింది. ఫ్లై ఓవర్ బ్రిడ్జి పైన 20 కి పైగా చోట్ల ఎక్స్పెన్షన్ జాయింట్లు పూర్తిగా దెబ్బతిని గోతులు ఏర్పడడంతో పాటు, స్టీల్ దెబ్బతిని వాహనాల టైర్లు దెబ్బతింటున్నాయని వాహన యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై నుండి అవి వేగంగా వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. అలాగే పలుచోట్ల సిమెంటు స్లాబ్ దెబ్బతిని పెచ్చులూడి రాకపోకలకు ఇబ్బందిగా ఆర్‌ఓబి తయారైందని చెబుతున్నారు.
అండర్ బిడ్జిది అదే పరిస్థితి
ఇక పట్టణ జ్రలు, తేలికపాటి వాహనాలు రైల్వే ట్రాక్ దాటేందుకు నిర్మించిన అండర్ బ్రిడ్జి (ఆర్ యు బి) పరిస్థితి అదే తరహాలో ఇబ్బందిగా మారిందని వాపోతున్నారు. చిన్నపాటి వర్షం వచ్చిన ఆర్యుబిలో వరద నీరు చేరి వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగిస్తుందని చెబుతున్నారు. సాధారణ సమయంలో కూడా ఆర్ యు బి లో నీరు ఉంటుందని, పాదాచారులు ఆర్యుబి దాటడానికి ఇబ్బందికరంగా మారిందని చెబుతున్నారు.
రైల్వే గేట్ వద్ద ఇబ్బందే.!
ఇక రైల్వే ట్రాక్ దాటేందుకు మరో మార్గంగా ఉన్న రైల్వే గేట్ వద్ద ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. ఇటీవల మూడో లైన్ పనుల కోసం రైల్వే గేటును విస్తరించారు. విస్తరించిన చోట తారు వేయకుండా వదిలేయడంతో వాహనాలు కంకర, రైల్వే పట్టాల మీద రాకపోకలు సాగించేందుకు ఆటంకంగా మారిందని చెబుతున్నారు. రైల్వే గేటు విస్తరించిన చోట పూర్తిగా కంకర పైకి లేచి ద్విచక్ర వాహనాల సైతం నడవలేని పరిస్థితి ఏర్పడింది.
ప్రతిరోజు మహబూబాబాద్ పట్టణ ప్రజలు ఈ మూడు మార్గాల ద్వారా ఇరువైపులా ప్రయాణిస్తుంటారు. అటువంటిది మూడు చోట్ల కూడా ఇబ్బందికరంగా మారడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆర్‌ఓబి కి మరమ్మతులు చేయడంతో పాటు, ఆర్ యు బి లో నీళ్లు నిలవకుండా చర్యలు తీసుకోవాలని, అలాగే రైల్వే గేట్ వద్ద పట్టాల మధ్య తారు వేయించి ఇబ్బందులు లేకుండా చూడాలని పట్టణ ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.