05-07-2025 12:23:32 AM
నిజామాబాద్, జూలై 4 (విజయక్రాంతి): నిజామాబాద్ నగరంలో స్థిరాస్తి వ్యాపారులు చెలరేగిపోతున్నారు. రాజకీయ, అధికారుల అండదండలతో అడ్డూఅదుపు లేకుండా అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రశ్నించిన వారిని బెదిరిస్తున్నారు. ప్రజల నుంచి కోట్లు కొల్లగొట్టి వ్యాపారంలో నష్టం వాటిల్లిందంటూ దొంగ ఏడుపులు నటిస్తున్నారు. భూమిని అమ్మేది ఒకరికి.. రిజిస్ట్రేషన్ మరొకరికి చేయించేసి నమ్మిన వాళ్లను నిండా ముంచుతున్నారు.
నాయకులకు అడిగినంత ముట్టజె ప్పడం.. వారితో అధికారులపై ఒత్తిడి చేయడం వీరికి వెన్నతో పెట్టిన విద్యలా మారింది. డబ్బుల వసూలు ఆ తర్వాత మరొకరితో పొత్తు.. పొత్తుల గొడవల సాకుతో కోట్ల రూపాయల చెల్లించిన కొనుగోలుదారులకు కుచ్చుటోపి పెడుతున్నారు.
జేజే డెవలపర్స్ సంస్థ పేరిట అమ్మకాలు
నిజామాబాద్ నగరంలో జరిగిన స్థిరాస్తి మేళాలో జేజే డెవలపర్స్ పేరిట స్టాల్ ఏర్పాటు చేశారు. మేళాకు వచ్చిన ప్రజలకు తమ వెంచర్లో తక్కువ ధరలో ప్లాట్లు ఉన్నాయని, భవిష్యత్తులో రేట్లు పెరుగుతాయని.. అన్ని వసతులతో వెంచర్ ఏర్పాటు చేశామని నమ్మబలికారు. ఆకర్షితులైన కొందరు విశ్రాంత ఉద్యోగులు, చిన్నాచితకా పనులు చేసుకునే మధ్యతరగతి వాళ్లు దాచుకున్న డబ్బులతో జేజే డెవలపర్స్ నిర్వాహకులకు డబ్బులు చెల్లించి ప్లాట్లు కొనుగోలు చేశారు.
72 ప్లాట్లకు గాను దాదాపు రూ.12 కోట్లకు పైగా డబ్బులు చెల్లించినట్లు తెలుస్తోంది. ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలని కొనుగోలు దారులు అడిగినప్పుడల్లా సదరు జేజే డెవలపర్స్ నిర్వాహకులు రేపుమాపూ అంటూ కాలయాపన చేశారు. బాధితులు గట్టిగా నిలదీయగా భూముల్లో 72 ప్లాట్లకు నెంబర్లు వేసి వారికి ఇచ్చారు.
ప్లాట్లలో వెలిసిన బోర్డు
తమకు కేటాయించిన నంబరు ప్లాట్ల వద్దకు వెళ్లిన కొనుగోలుదారులకు గట్టి షాక్ తగిలింది. ఇక్కడ ఎవరికీ ఎలాంటి ప్లాట్లు లేవు.. ఈ భూమి అంత తమ పేరున రిజిస్ట్రేషన్ అయిందని వెంకటేశ్వర కన్స్ట్రక్షన్ భాగస్వాములు పూర్తి హక్కులు కలిగి ఉన్నారని, జేజే డెవలపర్స్కు ఆ భూమికి ఎలాంటి సంబంధం లేదని బోర్డు కూడా ఏర్పాటు చేయడంతో ప్లాట్లకు డబ్బులు కట్టిన వారు ఖంగుతిన్నారు. అక్కడే ఉన్న గుండాలతో ప్లాట్లకి డబ్బులు చెల్లించిన వారిని తరిమివేశారు.
జేసీబీలతో తొలగింపు
జే జే డెవలపర్స్ నంబర్లు వేసి ఇచ్చిన ప్లాట్లలో కొనుగోలుదారులు వేసుకున్న ఖనీలను జేసీబీలతో తొలగించారు. దీంతో తాము మోసోయామని బాధితులు తెలుసుకున్నారు. తమ వద్ద డబ్బులు తీసుకున్న జేజే డెవలపర్స్ భాగస్వాములను నిలదీయగా.. పట్టేదారు నుంచి తాము భూమి కొన్నామని, పట్టేదారు తమని డబ్బుల కోసం ఒత్తిడి తేవడంతో ఫైనాన్సర్లను ఆశ్రయించి, వారి వద్ద నుంచి డబ్బులు తీసుకున్నామని చెప్పారు. అందుకోసం జేజే డెవలపర్ పేరు వేసిన వెంచర్ భూమిని ఫైనాన్సర్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించామని తాపీగా సమాధానం ఇస్తున్నారు.
అందరం కలిసి ఆందోళన చేద్దాం
రూ.12 కోట్లకు పైగా డబ్బులు చెల్లించిన 72 మంది.. ప్లాట్లు విక్రయించిన జేజే డెవలపర్స్ భాగస్వాములను నిలదీయగా.. కలిసి ఆందోళన చేద్దామని తాపీగా ఉచిత సలహా ఇవ్వడం కొసమెరుపు.