calender_icon.png 5 July, 2025 | 7:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేటు బడి.. పుస్తకాలతో రా‘బడి’!

05-07-2025 01:20:19 AM

  1. ఒకవైపు ఫీజుల భారం.. మరోవైపు పుస్తకాలతో బేరం.        
  2. విద్యార్థులకు పుస్తకాలు బరువు తల్లిదండ్రులకు ఖర్చుల దరువు
  3. అమలు కాని ప్రభుత్వ ఆదేశాలు మామూళ్ల మత్తులో విద్యాశాఖాధికారులు

సూర్యాపేట, జూలై 4 (విజయక్రాంతి) : విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించాలన్న ఆకాంక్షతో వారి తల్లిదండ్రులు చదువు కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడడం లేదు. ఈ నిర్ణయమే ప్రైవేటు పాఠశాలల రావడానికి రాజమార్గంగా మారింది. విద్యార్థుల తల్లిదండ్రులు ఓ వైపు ఫీజులు భారం మోస్తుండగా మరో వైపు వారిపై పుస్తకాల కొనుగోలు పేరుతో ఖర్చుల దరువు వాయిస్తున్నారు.

తప్పనిసరిగా తమ పాఠశాలల్లోనే పుస్తకాలను కొనుగోలు చేయాలనే నిబంధన పెడుతుండడంతో తల్లిదండ్రులు చేసేదేమీ లేక అడిగినంత డబ్బులు చెల్లించి  కొనాల్సిన పరిస్థితిలు ఏర్పడుతున్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో పాఠ్యపుస్త కాలు, నోటు పుస్తకాలు, యూనిఫామ్స్ విక్రయించరాదని ప్రభుత్వ  నిబంధనలు ఉన్న విద్యాశాఖ అధికారుల మామూళ్ల మత్తు కారణంగా వాటిని పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. 

దీంతో జిల్లాలో ప్రైవేట్ బడిలో పుస్తకాలు అమ్మకాల దందాను యథేచ్ఛగా కొనసాగుతుంది. ఇది చాలాదన్నట్టు యూనిఫాం, మెటీరియల్, షూస్, టై, బెల్ట్ దందా వేరే. దీంతో తల్లిదండ్రులకు పిల్లల చదువు పెను భారంగా మారింది.  అంగడి సరుకుగా పాఠశాల విద్య :  జిల్లాలోని పట్టణాలు, పలు గ్రామాలలో సేవ పేరుతో ప్రైవేటు పాఠశాలను స్థాపించి ఫీజుల పేరుతో లక్షల్లో డబ్బులు వసూలు చేస్తూ, విద్యను అంగడి సరుకుగా అమ్ముతున్నారు.

దీనికి తోడు యాజమాన్యాలు పుస్తకాల దందా కొనసాగిస్తున్నాయి. ఖచ్చితంగా తాము  సూచించిన చోటే పుస్తకాలు, నోటుబుక్స్ తీసుకోవాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నారు. మా వద్దే పుస్తకాలు కొనాలంటూ హుకుం జారి : ప్రతి ప్రైవేటు పాఠశాలలో పుస్తకాల అమ్మకం కోసం ఒక ప్రత్యేక గదిని ఏర్పాటు చేసి దానిలో పుస్తకాలను ఉంచి ఒక ఉపాధ్యాయున్నీ కేటాయించి యదేచ్ఛగా అమ్మకాలు కొనసాగిస్తున్నారు.

మావద్ద పుస్తకాలు కొనాలని వేరే చోట తీసుకుంటే మాత్రం బాగుండదు అని తల్లిదండ్రులకు హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఒక్కో పాఠశాల విద్యార్థుల నుండి పుస్తకాల పేరిట లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్టు తెలుస్తుంది. రూ. 3_ 5 వేల వరకు వసూళ్లు: ఎల్ కే జీ నుండి ఐదో తరగతి వరకు ప్రైవేటు పాఠశాలలు తమకు ఇష్టం వచ్చిన కంపెనీలకు చెందిన పుస్తకాలను ఎంపిక చేసుకొని వాటిని పాఠశాలలో అమ్ముతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

అయితే ఈ పుస్తకాలు ఆ పాఠశాలలో తప్ప మరి ఏ ఇతర పుస్తకాల దుకాణాలలో లభ్యం కానందున ఖచ్చితంగా  వారు చెప్పిన రేట్ కి అదే పాఠశాలలో లేదా వారు ఏర్పాటు చేసిన దుకాణాలలో మాత్రమే కొనాల్సివస్తుంది.  దీంతో ఆ పాఠశాలలో కేవలం పుస్తకాల పేరిట ఒక్కో విద్యార్థి నుంచి తరగతిని బట్టి 3_5  వేల వరకు వసూలు చేస్తున్నట్లు తల్లిదండ్రుల ద్వారా తెలుస్తుంది.

6 నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్, నోటు పుస్తకాల పేరిట ఇదే దోపిడీ కొనసాగుతుంది. పుస్తకాలపై పాఠశాలల పేర్లు: జిల్లాలోని పలు పట్టణాలలో గల కార్పొరేట్, ఇతర పాఠశాలలు పాఠ్యపుస్తకాలు, ఇతర కాంపిటీటివ్ బుక్స్, నోటు పుస్తకాల మీద తమ పాఠశాల పేరును అచ్చు వేయించి వాటిని ఆయా పాఠశాలలో విద్యార్థులు వాడాలని ఆదేశిస్తున్నారు.

దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు నోటు పుస్తకాలను సైతం ఎక్కువ రేటు చెల్లించి అక్కడే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.  పెరుగుతున్న అదనపు భారం: పుస్తకాలతో పాటుగా షూస్, టై బెల్ట్ పేరున మరో రకమైన దందా నడుస్తుంది. ఆన్లైన్ యాప్స్, ఎగ్జామ్ ఫీజు పేరిట తల్లిదండ్రుల నుండి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు అందిన కాడికి డబ్బులు దండుకుంటున్నాయి. దీంతో వారిపై అదరపు ఆర్థిక భారం పడుతుంది.

మొత్తానికి సేవ పేరిట ఏర్పాటు చేసిన ప్రైవేటు పాఠశాలలు నిలువు దోపిడీకి నిలువుటద్దాలుగా మారిపోయాయనడంలో  ఎటువంటి సందేహం లేదని మేధావులు, విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. విద్యాశాఖ అధికారులు మామూళ్ల మత్తులో మునిగిపోవడం వలననే ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాల దందా కొనసాగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాల అమ్మకాల పేరిట జరుగుతున్న దోపిడిని అరికట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.  సూర్యాపేటలో ఓ పాఠశాల పుస్తకాలు సీజ్:. ఈనెల 2న సూర్యాపేట పట్టణంలోని హైవేకి పక్కన గల శ్రీ చైతన్య పాఠశాల కు సమీపంలో ఓ ఇంటికి సంబంధించిన రెండు గదుల్లో ఆ పాఠశాల పేరిట ఉన్న పుస్తకాలను విద్యార్థి,

బీసీ సంఘాల ఆధ్వర్యంలో విద్యాశాఖ అధికారులకు సమాచారం అందించగా వారు సీజ్ చేశారు. అయితే వీటి విలువ లక్షల రూపాయల్లో ఉండడం గమనార్హం. ఇదే తంతు జిల్లాలోని అనేక ప్రైవేట్ పాఠశాలల్లో కొనసాగుతున్న ఆ విషయాలు బయటకి రావడం లేదంటూ పాలు విద్యార్థి సంఘాల నాయకులు, స్వచ్ఛంద సంఘ నాయకులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.                                 

అధికారుల అలసత్వమే దోపిడీకి కారణం..      

ప్రైవేటు పాఠశాలలు  పుస్తకాల అమ్మకాల పేరిట విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. ఇంత జరుగుతున్న విద్యాశాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. వారి అలసత్వమే ఈ దోపిడీకి ప్రధాన కారణం.

ప్రైవేటు పాఠశాలల ఆగడాల గురించి అనేకసార్లు జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేసిన ఇటువంటి మార్పులు జరగడం లేదు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి వారి ఆగడాలకు అడ్డుకట్ట వేస్తే విద్యార్థుల తల్లిదండ్రులకు కొంతైనా న్యాయం జరుగుతుంది.

 వావిళ్ళ రమేష్ గౌడ్, బీసీ విద్యార్థి సంఘ సమైఖ్య రాష్ట్ర నాయకులు