హెచ్‌పీవీ టీకా ప్రత్యేక కార్యక్రమం
గద్వాల, మార్చి 08 ( విజయక్రాంతి): గర్భస్థ క్యాన్సర్ నివారణకు 14 ఏళ్ల బాలికలకు హ్యూమన్ పాపిలోమా వైరస్ టీకా ప్రత్యేక కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు తెలిపారు. గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ నర్సింగరావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ టీకా కార్యక్రమం మైక్రో ప్లాన్ ప్రకారం ప్రతి పని దినంలో ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకు నిర్వహించబడుతుందని తెలిపారు. టీకా కార్యక్రమానికి సంబంధించిన అన్ని వివరాలు యు -విన్ పోర్టల్లో నమోదు చేయబడతాయని, అన్ని ఎంట్రీలు సంబంధిత డీఎంఈ/ టీవీవీపీ సంస్థల పేరుతో ఫెసిలిటీ -బేస్డ్ సెషన్ సైట్ ద్వారా నమోదు చేయాలని సూచించారు.
ప్రతి టీకా సెషన్లో మెడికల్ ఆఫీసర్, ఏయెన్‌ఏం,ఆశ మరియు వెరిఫయర్ సభ్యులతో కూడిన బృందం పనిచేస్తుందని తెలిపారు. సంబంధిత ఆసుపత్రి వద్ద కోల్ చెయిన్ పాయింట్ లేకపోతే సమీప సీసీపీ నుండి టీకాలు అందజేయబడతాయని తెలిపారు. హెచ్ పీవి టీకా సింగిల్ డోస్ ఒక్కరికి 0.5 మిల్లీ లీటర్ల మోతాదు ఇవ్వబడుతుందని తెలిపారు. ప్రతి టీకా డోస్కు పూర్తి బాధ్యత ఉంటుందని, టీకా వృథా కాకుండా సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
టీకా వేయించే ముందు బాలిక ఖాళీ కడుపుతో ఉండకూడదని చెప్పారు. వయస్సును ఫోటో ఐడీ ద్వారా నిర్ధారించాలని, అలాగే యు -విన్ లో ఓటీపీ కోసం తల్లిదండ్రులు లేదా సంరక్షకుల మొబైల్ నంబర్ అందుబాటులో ఉండాలని సూచించారు. ఇప్పటికే టీకా తీసుకున్నట్లయితే సంబంధిత వివరాలను యు-విన్ లో నమోదు చేయాలని తెలిపారు. టీకా అనంతరం 30 నిమిషాల పాటు పరిశీలనలో ఉంచడం తప్పనిసరి అని చెప్పారు..టీకా తీసుకున్న బాలికల వివరాలను ప్రత్యేకంగా నమోదు చేసి లైన్ లిస్ట్ నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే ఇంటింటి సర్వే ద్వారా జిల్లాలో 7103 మంది 14 ఏళ్ల బాలికలను గుర్తించారన్నారు.
గద్వాల ప్రభుత్వ ఆసుపత్రి తో పాటు అలంపూర్ క్రాస్ రోడ్డు వద్ద ఉన్న 100 పడకల ప్రభుత్వాసుపత్రిలో, అలంపూర్ సిహెచ్సి లో కూడా ఈ వ్యాక్సిన్ ను వేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గద్వాల మున్సిపల్ చైర్ పర్సన్ జయలక్ష్మి, స్థానిక కౌన్సిలర్ నరసింహులు, డీఎంహెచ్వో సంధ్య కిరణ్మయి, జిల్లా ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం అధికారి సిద్ధప్ప, ఆర్‌ఎంఓ హేమలత, ఇతర వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.




