మహిళలకు వంటగ్యాస్ ధరల పెంపు గిఫ్ట్
పెంట్లవెల్లి, మార్చి 8: నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ముందు ఆదివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ ధరలను పెంచడం అన్యాయమని కెవిపిఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్. హనుమంతు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహిళలకు కానుకగా గ్యాస్ ధరలు పెంచిందన్నారు.
సామాన్య ప్రజలపై నిత్యావసర వస్తువుల ధరలు నిరంతరం పెంచుతూ, కార్పొరేట్ సంస్థలకు అనుకూల విధానాలు అమలు చేస్తోందన్నారు. పేద ప్రజలపై భారాలు మోపుతూ ధనవంతులకు మద్దతుగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.500కు గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి మోసం చేసిందని ఆరోపించారు. ప్రస్తుతం రూ.1000 తీసుకుని రూ.500 ఖాతాల్లో జమ చేస్తామని చెబుతున్నా, చాలా మందికి ఆ డబ్బులు పడటం లేదని పేర్కొన్నారు.
ఒకవైపు కేంద్ర ప్రభుత్వం, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని మండిపడ్డారు. వెంటనే గ్యాస్ ధరలను తగ్గించకపోతే ప్రజలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి శివలీల, రైతు సంఘం మండల కార్యదర్శి ఎల్ల గౌడ్, వార్డు సభ్యుడు బత్తిని రాజు రాజు, కార్మికులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.




