11 March, 2026 | 3:45 AM

భారీ నజరానా

11-03-2026 12:20 AM
  1. భారత్‌కు బీసీసీఐ రూ.131 కోట్లు రివార్డు
  2.   2024 కంటే రూ.6 కోట్లు ఎక్కువ
  3. త్వరలోనే భారత జట్టుకు ఘనసత్కారం

ముంబై, మార్చి 10 : టీ ట్వంటీ ప్రపంచకప్ వరుసగా రెండోసారి గెలుచుకుని చరిత్ర సృష్టించిన భారత జట్టుపై బీసీసీఐ కాసుల వర్షం కురిపించింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ నజరానా ప్రకటించింది. ఈ విజయానికి రివార్డుగా భారత్‌కు రూ.131 కోట్ల రూపాయలను క్యాష్ ప్రైజ్ గా అందించబోతున్నట్టు బీసీసీఐ సెక్రటరీ దేవజీత్ సైకియా ప్రకటించారు. అద్భుత ప్రదర్శనతో వరల్ కప్ గెలిచిన భారత జట్టును అభినందిస్తూ ఈ నజరానా ప్రకటించినట్టు తెలిపారు.

2024లో ఐసీసీ టీ20 ప్రపంచకప్ గెలిచినప్పుడు ఇచ్చిన నజరానా కంటే ఇది రూ.6 కోట్లు ఎక్కువ. అప్పుడు రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్ ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి ట్రోఫీ గెలుచుకోగా బీసీసీఐ రూ.125 కోట్లు నజరానాగా అందజేసింది. ఇప్పుడు మరో ఆరు కోట్లు ఎక్కువగానే క్యాష్ రివార్డ్ ప్రకటించింది. అప్పుడు జట్టులోని ప్రతీ ఆటగాడికీ రూ.5 కోట్ల చొప్పున, రిజర్వ్ ప్లేయర్స్ కు కోటి రూపాయల చొప్పున లభించాయి. ఇప్పుడు రూ.131 కోట్ల భారీ నజారానాలో ఎవరికి ఎంత మొత్తం అనేది వెల్లడించలేదు.

అయితే జట్టులోని 15 మంది ఆటగాళ్లకు ఒక్కొక్కరికీ రూ.5 నుంచి 6 కోట్ల వరకూ దక్కనుంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ , బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌లకు కూడా ప్లేయర్స్‌తో సమానంగా రివార్డు అందనుంది. సహాయక సిబ్బందిలో భాగంగా ఉన్న  ఫిజియోలు, ట్రైనర్లు, మసాజర్లు, వీడియో ఎనలిస్ట్, ఇతర స్టాఫ్‌కు వారి హోదాను బట్టి రూ. 1 కోటి నుంచి రూ. 2 కోట్ల వరకు క్యాష్ ప్రైజ్ లభించే అవకాశముంది. వీరితో పాటు జట్టును ఎంపిక చేసిన సెలెక్షన్ కమిటీ సభ్యులకు కూడా కోటి చొప్పున నగదు పురస్కారం దక్కనుంది.

అహ్మదాబాద్ మోదీ స్టేడియంలో ఆదివారం వేదికగా జరిగిన ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్‌ను చిత్తు చేసి ట్రోఫీ గెలిచింది. మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ 255 పరుగుల భారీస్కోరు చేయగా సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీలతో రాణించారు. తర్వాత ఛేజింగ్‌లో న్యూజిలాండ్‌ను భారత బౌలర్లు 159 పరుగులకే ఆలౌట్ చేశారు. బుమ్రా 4 ,అక్షర్ పటేల్ 3 వికెట్లతో కివీస్ ను దెబ్బకొట్టారు. ఫలితంగా వరుసగా రెండోసారి , ఓవరాల్‌గా మూడోసారి టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది.

కాగా త్వరలోనే బీసీసీఐ భారత జట్టుకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ నజరానా అందజేయనుంది. కాగా 2024లో టీ20 ప్రపంచకప్ గెలిచినప్పటి నుంచీ పొట్టి ఫార్మాట్‌లో భారత్ కు ఎదురే లేకుండా పోయింది. గత రెండేళ్లుగా టీ20ల్లో ఒక్క సిరీస్ కూడా టీమిండియా ఓడిపోలేదు. అదే జైత్రయాత్ర కొనసాగిస్తూ సొంతగడ్డపై వరల్ కప్‌ను సొంతం చేసుకుంది. కాగా ఈ ప్రపంచకప్ గెలిచినందుకు ఐసీసీ నుంచి భారత జట్టుకు రూ.27.48 కోట్ల రూపాయలు ప్రైజ్ మనీగా దక్కింది.

ఫైనల్లో అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకున్న బుమ్రా (4/15) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక వరుసగా హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలతో భారత్ ట్రోఫీ గెలవడంలో కీలకపాత్ర పోషించిన సంజూ శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. అటు ఐసీసీ టీమ్ ఆఫ్ ది టోర్నీలోనూ నలుగురు భారత క్రికెటర్లు సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ , హార్థిక్ పాండ్యా , జస్ప్రీత్ బుమ్రా చోటు దక్కించుకున్నారు.