కేటీపీపీలో శ్రీశైలం ప్రమాద మృతులకు ఘన నివాళులు
గణపురం,ఆగస్టు 21 (విజయ క్రాంతి): శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో 2020 ఆగస్టు 20న జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఇంజినీర్లు, ఉద్యోగుల సంస్మరణ దినోత్సవాన్ని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం కేటీపీపీలో టీజీపీఈఏ, టీఎస్‌ఈఏఈఏ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజినీర్ శ్రీ ప్రకాష్ తో పాటు ఇంజినీర్లు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించి మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సహోద్యోగుల త్యాగాలను ఎప్పటికీ మరువబోమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా భద్రతా ప్రమాణాలను కఠినంగా పాటించాలని, భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.






