మా తమ్ముడు చంపేస్తున్నాడంటూ ఫోన్ చేసింది.. భర్త శ్రీకాంత్
ఇబ్రహీంపట్నం,(విజయక్రాంతి): మహిళా కానిస్టేబుల్ పరువు హత్యకు గురైన దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. మృతురాలు నాగమణి హయత్ నగర్ పీఎస్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తుంది. నెలరోజుల క్రితం యాదగిరి గుట్టలో నాగమణి, శ్రీకాంత్ ప్రేమ వివాహం చేసుకుని హయత్ నగర్ లో కాపురముంటున్నారు. నిన్న ఆదివారం కావడంతో నాగమణి అత్తవారింటికి వెళ్లింది. అక్క కులాంతర వివాహం చేసుకోవడంతో అది సహించని తన తమ్ముడు పరమేశ్ రాయపోలు-మాన్యగూడ రహదారిపై బైక్ పై వెళ్తున్న కానిస్టేబుల్ నాగమణిని కారుతో ఢీకొట్టి కొడవలితో నరికి చంపేశాడు.
సమాచారం అందుకుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని మృతిదేహాన్ని స్వాధీనం చేసుకొని శవ పరీక్షనిమిత్తం మార్చీరుకి తరలించారు. అనంతరం తమ్ముడు పరమేశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా భర్త శ్రీకాంత్ మాట్లాడుతూ... తాము ఎనిమిది ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామని, నాగమణి కానిస్టేబుల్ అయ్యేందుకు తానే సహకరించినట్లు తెలిపారు. మృతురాలికి 2021లో కానిస్టేబుల్ ఉద్యోగం రావడంతో గతనెలలోనే యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్నట్లు శ్రీకాంత్ పేర్కొన్నారు. ప్రస్తుతం తనకు కూడా ప్రాణహాని ఉందని, చంపుతామని నాగమణి కుటుంబ సభ్యులు బెదిరించారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాగమణిని వాళ్ల తమ్ముడే చంపేశాడని, ఆమె చనిపోయే ముందు నాగమణి రాయపోల్ నుంచి బయలుదేరుతూ తానకు ఫోన్ చేసిందని చెప్పాడు. తన తమ్ముడు చంపేస్తున్నాడంటూ కంగారుగా ఫోన్ చేసిందని శ్రీకాంత్ వాపోయాడు. దీంతో ఇబ్రహీంపట్నం పీస్ వద్ద శ్రీకాంత్ కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు.




