17-07-2025 01:31:30 AM
నిత్యం గొడవలతో విసిగిపోయిన భార్య
వరంగల్ (మహబూబాబాద్), జూలై 16 (విజయక్రాంతి): కూల్‌డ్రింక్‌లో విషం కలిపి తాగించి భర్తను చంపిన భార్య ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ పరిధిలోని భవానికుంట తండాలో జరిగింది. భవాని కుంట తండాకు చెందిన బాలాజీ(44), కాంతి దంపతుల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ నెల 8న తండాలో దాటుడు పండుగ నిర్వహించగా..
బాలాజీ చికెన్ తీసుకువచ్చి వండి పెట్టమని భార్యకు ఇచ్చాడు. చికెన్ వండి పెట్టే లోపు మద్యం తాగి వస్తానని భర్త చెప్పగా.. ఇంట్లోనే మద్యం ఉన్నదని ఇక్కడే తాగమని కూల్‌డ్రింక్‌లో విషం కలిపి ఇచ్చింది. దాన్ని తాగిన బాలాజీ గొంతులో మంటతో విలవిలలాడుతున్నా పట్టించుకోకుండా అక్కడే వదిలేసి కాంతి తన బావ దశ్రు ఇంటికి వెళ్లింది.
ఈ విషయం తెలుసుకున్న బంధువులు బాలాజీని ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స మృతిచెందాడు. కుటుంబ గొడవలను సాకుగా చేసుకొని కాంతి.. తన బావ దసురు ప్రోత్సాహంతో కూల్‌డ్రింక్‌లో విషం కలిపి చంపిందని బాలాజీ తండ్రి హరిచందర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాంతి, దసురులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వర్ధన్నపేట ఎస్సై చందర్ తెలిపారు.