30-08-2025 12:06:30 AM
ఎల్బీనగర్, ఆగస్టు 29 : ఇటీవల కాలంలో భార్యాభర్తల బంధం హత్యలకు దారి తీస్తుంది. ప్రియుడి మోజులో పడి భార్యలు భర్తలను చంపిస్తున్నారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడి సాయంతో భార్య హత్య చేయించిన ఘటన శుక్రవారం సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చిం ది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... సరూర్ నగర్ లోని కోదండరాంనగర్ లో భార్యాభర్తలు చిట్టి (33), భర్త శేఖర్ (40) నివాసం ఉంటున్నారు.
వీరికి 16 ఏండ్ల క్రితం వివాహమైంది. ఉపాధి కోసం కొన్నేళ్లుగా కోదండరాంనగర్‌లో నివాసం ఉంటు న్నారు. భర్త శేఖర్ డ్రైవర్ పని చేస్తున్నాడు. భర్త డ్రైవింగ్ పై బయట ప్రదేశాలకు వెళ్ళినప్పుడు చిట్టికి హరీశ్ అనే యువకుడితో పరిచయం పెరిగి అక్రమ సంబంధా నికి దారితీసింది. వీరి అక్రమ సంబంధం తెలుసుకున్న భర్త శేఖర్ భార్యను పలుమార్లు నిలదీసి, హరీశ్ ను మరిచిపోవాలని హెచ్చరించాడు.
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను అడ్డు తొలిగించుకొనేందుకు భార్య చిట్టి ప్రియుడి హరీశ్‌తో కలిసి పథకం వేసింది. ఈ క్రమంలో గురువారం 28వ తేదీన అర్ధరాత్రి సమయంలో భర్తను చంపడానికి ప్రియుడి హరీశ్‌ను చిట్టి ఇంటికి పిలిపించింది. భర్త పడుకున్న తర్వాత ప్రియుడు హరీశ్ గొంతు నులమగా, చిట్టి డంబెల్‌తో భర్త తలపై కొట్టి హత్య చేసింది. సమాచారం తెలుసుకున్న సరూర్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సైదిరెడ్డి వివరించారు.