ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా
కాగజ్‌నగర్,(విజయ క్రాంతి): కాగజ్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం జిల్లా ఉపాధి కల్పనా శాఖ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల కెరీర్ గైడెన్స్, ప్లేస్ మెంట్ సెల్ తరపున జాబ్ మేళ నిర్వహించడం జరిగింది. అదే విధంగా జిల్లా ఉపాధి కల్పనా శాఖ వారి ఆధ్వర్యంలో 165 మంది విద్యార్థులకు ఎంప్లాయ్ మెంట్ ఎక్సేంజ్ నందు రిజిస్ట్రేషన్ ప్రక్రియ సైతం పూర్తి చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ కె.శ్రీదేవి, జిల్లా ఉపాధి కల్పనా శాఖ అధికారి బి.కిరణ్ కుమార్ తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఉపాధి కల్పనా శాఖ అధికారి మాట్లాడుతూ జిల్లాలోని నిరుద్యోగ యువత కొరకు వివిధ కంపేనీల సహకారంతో జాబ్ మేళాలు నిర్వహిస్తు అర్హులైన యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్లేస్ మెంట్ సెల్ సహకారంతో మరిన్ని ఉద్యోగ మేళా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.కళాశాల ప్రిన్సిపాల్ కె.శ్రీదేవి మాట్లాడుతూ... డిగ్రీ పూర్తి చేసిన ప్రతీ విద్యార్థి ఏదో ఒక రంగంలో స్థిరపడాలనే సంకల్పంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కళాశాల కెరీర్ గైడెన్స్, ప్లేస్ మెంట్ సెల్ ఇంచార్జ్ డా.డి.లక్ష్మినరసింహం మాట్లాడుతూ వివిధ కంపేనీలు మరియు జిల్లాలోని నిరుద్యోగ యువతకు మద్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల అనుసంధాన కర్తగా పనిచేస్తు ఉద్యోగావకాశాల కొరకు కెరీర్ గైడెన్స్ మరియు జాబ్ మేళా లాంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.అనంతరం ఉద్యోగాల కొరకు 68 మంది అభ్యర్థులు హాజరు కాగా మెడిప్లస్ కంపెని యాజమాన్యం వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి 8 మందిని ఎంపిక చేసుకున్నట్లు మెడిప్లస్ కంపెని ప్రతినిధి రాజు తెలిపారు.




