16 April, 2026 | 1:41 AM

పిల్లలతో పెద్దలకు పాఠం

16-04-2026 12:00 AM

రోడ్డు భద్రతలో కార్యక్రమంలో హుస్నాబాద్ ఏసీపీ సదానందం

హుస్నాబాద్, ఏప్రిల్15: హుస్నాబాద్ పట్టణంలోని సెయింట్ జోసెఫ్, మాంటిస్సోరి, సి.వి. రామన్ తదితర పాఠశాలలలో హుస్నాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో అరైవ్‌ఎలైవ్ కార్యక్రమంలో భాగంగా చిల్డ్రన్స్ రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుస్నాబాద్ ఏసీపీ సౌదారపు సదానందం హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ పిల్లలు కేవలం తమ భద్రతకే కాకుండా తమ తల్లిదండ్రుల బాధ్యతను కూడా గుర్తు చేసే పాత్ర పోషించాలని సూచించారు.

ముఖ్యంగా పుట్టినరోజు వేడుకల సందర్భంగా తల్లిదండ్రులకు హెల్మెట్ను బహుమతిగా ఇవ్వాలని, తద్వారా కుటుంబంలో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందుతుందని తెలిపారు. ఈ క్రమంలో విద్యార్థులు తమ తల్లిదండ్రుల పట్ల ఎలాంటి బాధ్యత తీసుకుంటారనే అంశంపై ప్రత్యేకంగా పరీక్షను నిర్వహించడం జరిగింది. అలాగే డ్రైవర్లతో మాట్లాడుతూ ప్రయాణికుల భద్రత పట్ల పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.

స్కూల్ బస్సుల్లో ప్రయాణించే సమయంలో పిల్లలు చేతులు బయటకు పెట్టకుండా చూడటంతో డ్రైవర్లు, కండక్టర్లు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తేనే ప్రమాదాలను తగ్గించవచ్చని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 2000 మంది విద్యార్థులు పాల్గొని రోడ్డు భద్రత నియమాలపై అవగాహన పొందారు. ట్రాఫిక్ నియమాలు, హెల్మెట్ వినియోగం, డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలు వంటి అంశాలపై విద్యార్థులకు వివరంగా తెలియజేశారు. మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని తల్లిదండ్రులకు సూచిస్తూ, హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయరాదని, డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు లేకుండా వాహనాలు నడపరాదని, వాహనాలకు ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు.

అదేవిధంగా స్కూల్ బస్సు డ్రైవర్లు, క్లీనర్లు విద్యార్థుల భద్రత పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. విద్యార్థులు బస్సులో కూర్చున్న తర్వాత కిటికీల్లోంచి చేతులు బయటకు పెట్టకుండా చూసే బాధ్యత డ్రైవర్లు, సిబ్బంది తీసుకోవాలని తెలిపారు. జిల్లాలోనే ఈ తరహా వినూత్న కార్యక్రమం నిర్వహించబడినదిగా హుస్నాబాద్ పోలీసులు పేర్కొన్నారు. చిన్నారుల ద్వారా సమాజంలో భద్రతా చైతన్యం పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వివరించారు. ఏసీపీ సదానందం నేతృత్వంలో నిర్వహించగా హుస్నాబాద్ ఎస్త్స్ర పాకాల లక్ష్మారెడ్డి, పోలీసు సిబ్బంది, ఆయా పాఠశాలల బాధ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.