calender_icon.png 12 January, 2026 | 2:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యాధుల కట్టడిలో హైదరాబాద్ భేష్

07-01-2026 01:14:48 AM

  1. ప్రశంసల జల్లు కురిపించిన కేంద్రం
  2. కీటక జనిత వ్యాధుల నియంత్రణలో దేశానికే ఆదర్శం 
  3. వీబీడీ యాప్, టెక్నాలజీతోనే డెంగ్యూ తగ్గుముఖం  
  4. సక్సెస్ స్టోరీని వివరించిన జీహెచ్‌ఎంసీ కమిషనర్  

హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 6 (విజయక్రాంతి): ప్రజారోగ్య పరిరక్షణలో, ముఖ్యంగా కీటకజనిత వ్యాధుల నియంత్రణలో హైదరాబాద్ మహానగరం దేశవ్యా ప్తంగా గుర్తింపు సాధించింది. అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకుని డెంగ్యూ వంటి వ్యాధులను సమర్థవంతంగా అరికడుతున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పనితీరుపై కేంద్ర ప్రభుత్వం ప్రశంసల జల్లు కురిపించింది. నాగ్పూర్లో జరిగిన మెట్రోపాలిటన్ సర్వైలెన్స్ యూని ట్స్ జాతీయ స్థాయి సమీక్షా సమావేశంలో హైదరాబాద్ విధానాలకు ప్రత్యేక గుర్తింపు లభించింది.

ఈ ప్రతిష్టాత్మక సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ పాల్గొని, టెక్నాలజీ డ్రివెన్ వెక్టర్ బోర్న్ డిసీ జ్ సర్వైలెన్స్, మేనేజ్మెంట్ అనే అంశంపై ప్రజెంటేషన్ ఇచ్చారు. 2025లో హైదరాబాద్‌లో డెంగ్యూ కేసులను గణనీయంగా తగ్గించడంలో జీహెచ్‌ఎంసీ విజయగాధను ఆయన వివరించారు. ప్రధానంగా వెక్టర్ బోర్న్ డిసీజెస్ యాప్ ద్వారా నిఘా వ్యవస్థను ఎలా పటిష్టం చేసిందీ విడమరచి చెప్పారు. జీఐఎస్ ఆధారిత డ్యాష్బోర్డులు, ఎప్పటికప్పుడు అందే రియల్ టైమ్ డేటా సహాయంతో క్షేత్రస్థాయి సిబ్బంది సకాలంలో స్పందిస్తున్నారని, దీనివల్ల వ్యాధుల వ్యాప్తిని అడ్డుకోగలిగామని ఆయన వెల్లడించారు.

డేటా ఆధారిత విధానాలు,సాంకేతికత వినియోగం, వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం వల్లే హైదరాబాద్‌లో సానుకూల ఫలితాలు వచ్చాయని కేంద్ర ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. కీటకజనిత వ్యాధుల నియంత్రణకు సంబంధించి హైదరాబాద్ పాటిస్తున్న ఈ ప్రత్యేక నమూనా దేశంలోని ఇతర మెట్రో నగరాలకు, పట్టణాలకు ఆదర్శంగా నిలుస్తుందని కేంద్రం కొనియాడింది.