ప్రగతినగర్ వాసుల పాలిట 'హైడ్రా' అభయం
కబ్జాదారుల చెరనుండి శ్మశానవాటికకు విముక్తి
భూమి చుట్టూ పటిష్టమైన ఫెన్సింగ్ వేసిన హైడ్రా అధికారులు
ఒంటరి పోరాటంతో విజయం సాధించిన ఉప్పు జస్వంత్
కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): దాదాపు లక్షన్నర జనాభా ఉన్న ప్రగతినగర్ కు కనీసం అంత్యక్రియలు నిర్వహించడానికి సరైన శ్మశానవాటిక లేకపోవడం దశాబ్దాలుగా వేధిస్తున్న సమస్య. అంబీర్ చెరువు బఫర్ జోన్ లోని సర్వే నెంబర్ 103 లో 9 ఎకరాల ప్రభుత్వ స్థలం (శ్మశానవాటిక, డంపింగ్ యార్డ్) ఉన్నప్పటికీ, కబ్జాదారుల కబంధ హస్తాల్లో చిక్కుకుని అభివృద్ధికి నోచుకోలేదు.
ఈ దౌర్భాగ్య స్థితిని మార్చడానికి, స్థానిక ప్రజల కోసం ఫర్ ఏ బెటర్ సొసైటీ వ్యవస్థాపకుడు ఉప్పు జస్వంత్ నడుం బిగించారు. ఆయన ఏడాదికి పైగా అధికార యంత్రాంగం చుట్టూ తిరిగి, అలుపెరగని పోరాటం చేసి సాధించిన విజయమిది. జస్వంత్ 02-03-2026న చేసిన తుది ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ ఐపీఎస్, మంగళవారం ఆ భూమి చుట్టూ పటిష్టమైన ఫెన్సింగ్ వేయించి ప్రగతినగర్ వాసులకు అభయమిచ్చారు.
రంగనాథ్ సత్వర చర్యలు.. హైడ్రా హెచ్చరిక బోర్డు
జస్వంత్ సుదీర్ఘ పోరాటాన్ని, సమర్పించిన ఆధారాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ తక్షణమే స్పందించారు. జీవో ఎంఎస్ నెంబర్ 99 ప్రకారం.. సర్వే నెంబర్ 103లోని 9 ఎకరాల భూమి చుట్టూ మంగళవారం హైడ్రా అధికారుల ఆధ్వర్యంలో పటిష్టమైన ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా, ఇది జీహెచ్ఎంసీకి చెందిన స్థలమని, దీనిని హైడ్రా రక్షిస్తోందని, ఆక్రమించే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ భారీ నోటీసు బోర్డును పాతారు.
ప్రగతినగర్ ప్రజల విజయం ఇది: ఉప్పు జస్వంత్
స్థానికుల ఇబ్బందులను తన సొంత బాధగా భావించి పోరాడిన జస్వంత్ కృషి ఎట్టకేలకు ఫలించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది ప్రగతినగర్ వాసులందరి విజయం. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, బెదిరింపులు వచ్చినా స్థానిక ప్రజల కోసం నా పోరాటం ఆపలేదని అన్నారు.తన వినతిపై తక్షణమే స్పందించి భూమిని రక్షించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ కి, అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.




