నేనూ భారతీయుడినేగా!
మా ఉద్యోగాలు భారతీయులు కొల్లగొడుతున్నారు
అమెరికాలోని ఓ ప్రవాస భారతీయుడి ఆవేదన
న్యూయార్క్, జూన్ 11: ఆర్థిక మందగనం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో వేల మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. చిన్నాపెద్ద అన్న తేడా లేకుండా అన్ని కంపెనీలు పొదుపు చర్యల్లో భాగంగా ఉద్యోగులను తగ్గించుకొంటున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలోని ఓ ప్రవాస భారతీయ ఇంజినీర్ కూడా తన ఉద్యోగం కోల్పోయాడు. కంపెనీ తనను తీసేసి ఆ ఉద్యోగం భారతీయుడికి ఇచ్చిందని ఆవేదన వ్యక్తంచేశాడు. ఆల్ఫాఫోక్స్ అనే ఎక్స్ అకౌంట్‌లో తన ఆవేదనను తెలుపుతూ ఓ వీడియోను పోస్ట్ చేయటంతో అది వైరల్‌గా మారింది.
వీడియోలో మొదట తాను అమెరికాకు ఎలా వచ్చింది.. ఉద్యోగం ఎలా సంపాదించాడన్న విషయాలు తెలిపాడు. చివరలో తనను ఉద్యోగం నుంచి తీసేయటం గురించి వివరించాడు. ‘నేను వాళ్లకు (కంపెనీ యాజమాన్యానికి) చెప్పాను.. నేను కూడా భారతీయుడినే అని.. అలాంటప్పుడు నన్ను తీసేసి ఆ ఉద్యోగం మరో భారతీయుడికి ఇవ్వటం ఏమిటని ప్రశ్నించాను. నేను ఇండియాలోనే పుట్టానని, నా కుటుంబం పనికోసం అమెరికా వచ్చిందని వివరించేందుకు ప్రయత్నించాను. కానీ కంపెనీ పట్టించుకోలేదు. ఇండియాలో తక్కువ జీతాలకు ఉద్యోగులు దొరుకుతారు కాబట్టి మీ టీంను మొత్తం తీసేసి వాటిని ఇండియన్స్‌కు ఇచ్చాం. ఆ విషయం మీరు అర్థంచేసుకోవటం లేదు అని చెప్పారు. ఇది దారుణం. మా ఉద్యోగాలు భారతీయులు ఎగరేసుకుపోతున్నారు’ అని ఆవేదన వ్యక్తంచేశాడు.






