2 April, 2026 | 3:18 AM

జంట కొరకు జింకై చేరా నిన్ను..

02-04-2026 12:00 AM

‘బిచ్చగాడు’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మల్టీ టాలెంటెడ్ విజయ్ ఆంటోని, దర్శకుడు శశి కాంబోలో వస్తున్న సినిమా ‘వంద దేవుళ్లు’. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్, ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్నాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, అరుళ్ దాస్, బక్స్, వినోదిని, మునిష్ కాంత్, కొడంగి వడివేలు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ సినిమాను వేసవి కానుకగా మే నెలలో రిలీజ్ చేయబోతోన్నారు.

తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఇది కలనో’ అంటూ సాగే మెలోడీ గీతాన్ని విడుదల చేశారు టీమ్. ‘ఏదో ఏదో ఇది మాయలాగా ఉన్నదే.. నీతో ఉంటే ఎద తేలిపోతూ ఉన్నదే.. మనసులోన వేల వేల కొత్త ఆశలెన్నో రేగి మార్చినాయి ఎదను. తోడు కొరకు చూసి చూసి కళ్లు.. వేచినాక ఏళ్లు.. చేరినావు కడకు.. ఇంతవరకు తోడే లేని నేను.. జంట కొరకు జింకై చేరా నిన్ను.. ఇది వలలా కట్టేసిందే నన్ను..

ఒక్క చూపులో చెప్పేసిందే ఎన్నో.. ఇది కలనో.. మాయ వలనో తెలీదే..’ అంటూ సాగుతోందీ గీతం. బాలాజీ శ్రీరామ్ స్వరపర్చిన ఈ పాటకు భాష్యశ్రీ సాహిత్యం అందించగా శిభి శ్రీనివాసన్, శిరీష భాగవతుల పాడారు. ఈ చిత్రానికి ఎస్‌బీ దర్శన్ కిర్లోష్ కెమెరామెన్‌గా, బాలాజీ శ్రీరామ్ సంగీత దర్శకుడిగా, హరీశ్ యువరాజ్ ఎడిటర్‌గా, భాష్య శ్రీ డైలాగ్ రైటర్‌గా పనిచేస్తున్నారు.