కాంగ్రెస్ కండువా.. దౌర్భాగ్యుల వల్లే కప్పుకున్నా!
- కేసీఆర్‌ను మోసగించి కాంగ్రెస్‌లో చేరే ఉద్దేశం లేదు
- అన్నంపెట్టిన వాళ్లను మరువ
- కాంగ్రెస్‌లో చేరితే బిల్లులు ఇస్తామన్నారు.. ఇప్పుడు నా ఫోన్ ఎత్తట్లేదు
- వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్సే గెలుస్తుంది
- బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం సంచలన వ్యాఖ్యలు
బాన్సువాడ, ఆగస్టు 11 (విజయక్రాంతి): తాను కాంగ్రెస్ జెండా కప్పుకో లేదని, జాతీయ జెండా మాత్రమే కప్పుకున్నానని.. కేసీఆర్‌ను మోసం చేసి కాం గ్రెస్‌లో చేరే ఉద్దేశం తనకు లేదని, అన్నం పెట్టిన వాళ్లను ఎప్పుడూ మర్చిపోనని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గ అభివృద్ధి, బిల్లుల నిమిత్త మే సీఎం రేవంత్‌ను కలిశానని, కొందరు దౌర్భాగ్యుల వల్లే కండువా కప్పుకున్నానని తీవ్రంగా చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్సే గెలుస్తుందని ఘంటాపథంగా చెప్పారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పోచారం చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మాజీ సీఎం కేసీఆర్‌ను మోసం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాలనే ఉద్దేశం తనకు లేదన్నారు. మాజీ సీంఎ కేసీఆర్ హయాంలోనే తన నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని చెప్పారు.
నియోజకవర్గంలోని కార్యకర్తలు చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లుల కోసం తన కుమారుడు పోచారం భాస్కర్‌రెడ్డిని సీఎం సోదరుడు కృష్ణారెడ్డి వద్దకు పంపించానని తెలిపారు. అక్కడ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించాలన్నా, కొత్త పనులు మంజూరు కావాలన్నా పార్టీ మారి కాంగ్రెస్ కండువా కప్పుకోవాల్సిందేనని స్పష్టంగా చెప్పారని పోచారం ఆరోపించారు.
ఈ కారణంగానే తాను పార్టీ మారాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. తాను ఇప్పటికీ కాంగ్రెస్ జెండా కప్పుకోలేదు.. జాతీయ జెండానే కప్పుకున్నాను అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో చేరితే ఆరు నెలల్లోనే తన నియోజకవర్గానికి సంబంధించిన పెండింగ్ బిల్లులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని.. కానీ ఇప్పటి వరకు సగం నిధులు మాత్రమే ఇచ్చారని చెప్పారు. బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు ఆపేశారని తెలిపారు.
బిల్లుల విషయమై గత నవంబరులో నిర్వహించిన ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీలో తాను సీఎం రేవంత్‌ను సూటిగా ప్రశ్నించానని చెప్పారు. తన ఎమ్మెల్యేగిరిని కొన్నారా, తాను అమ్ముడుపోయానా? అని ప్రశ్నించానని వెల్లడించారు. అయితే నిధుల మంజూరుకు సంబంధించి సీఎం చెప్పినట్లుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి మంజూరు చేయలేదన్నారు.
పెండింగ్ నిధులు, అభివృద్ధి పనుల గురించి అడిగేందుకు తాను ఫోన్ చేస్తే సీఎం గానీ, మంత్రులు గానీ ఫోన్ ఎత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం అధికారులు, నాయకుల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
బాన్సువాడ నియోజకవర్గంలో నిర్వహించిన ఇంటెలిజెన్స్ సర్వేలో బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఫలితాలు రాబోతున్నాయని, రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్సే గెలుస్తుందని కార్యకర్తలకు పోచారం ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు శశికాంత్, నార్ల రవీందర్, ఏర్వాల కృష్ణారెడ్డి, ఏజాజ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మళ్లీ బీఆర్‌ఎస్‌లోకి పోచారం!
పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇది తొలిసారేమీ కాదు. గతంలోనూ చాలా సందర్భాల్లో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అయితే ఈసారి చేసిన వ్యాఖ్యలను గమనిస్తే ఆయన మళ్లీ బీఆర్‌ఎస్‌కు దగ్గరవుతున్నట్టుగా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అయితే పార్టీ మార్పు వెనుక ఉన్న కారణాలను కార్యకర్తల సమావేశంలో పోచారం వెల్లడించడంతో ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం అటు కాంగ్రెస్ పార్టీలో.. రాష్ట్ర రాజకీయాల్లో దుమారాన్ని రేపుతున్నాయి.






