పత్తి వైపే మొగ్గు
* ఈ వానాకాలం లో ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తాయని.. వరి, పత్తి కాకుండా ఇతర ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లాలని ప్రభుత్వం ఎంత ప్రచారంచేసినా రైతులు పెద్దగా ఆసక్తిచూపడం లేదు. ఆరుతడి పంటలు వేయాలని వ్యవసాయ శాఖ అధికారులు చేసిన సూచనల్ని అన్నదాతలు పెద్దగా పట్టించుకున్నట్లుగా కనిపించడం లేదు.
వరి, పత్తి, మొక్కజొన్నను అమ్ముకోవడానికి మార్కెట్ సౌకర్యంతో పాటు మద్దతు ధర ప్రకటించి, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను సైతం ఏర్పాటు చేస్తోంది. కానీ ప్రత్యామ్నాయ పంటలు అమ్ముకోవడానికి సరైన మార్కెట్ సౌకర్యం లేదు. దళారుల దోపిడీ, కోతుల బెడదతో పాటు కనీస మద్దతు లేకపోవడం రైతులకు సమస్యగా మారింది. దీంతో ఎలాంటి సమస్య లేకుండా అమ్మకాలు జరిగే వరి, పత్తి, మక్కల సాగుకే రైతులు ఆసక్తిచూపుతున్నారు.
- వరి, మొక్క జొన్నకే జై.. ఆరుతడి పంటల వైపు ఆసక్తి చూపని అన్నదాత
- మార్కెటింగ్ లోపం, దళారుల దోపిడీ, కోతుల బెడద కారణం
హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): ఎల్ నినో భయాలు వెన్నంటు తున్నా రాష్ట్రంలో రైతాంగం పాత పద్ధతిలోనే వరి, పత్తి, మొక్కజొన్న పంటలనే అధికంగా సాగు చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రత్యామ్నాయ పంటలైన పండ్లు, కూరగాయలు, పూల తోటలు, ఆయిల్‌పామ్, నూనెగింజలు, పప్పుధాన్యాలు, చిరు ధాన్యాలు, ఇతర వాణిజ్య పంటలే వేయాలని ఊరురా ప్రచారం చేసినా.. రైతులు కొత్త రకం పంటల సాగు కు వెనకడుగు వేస్తున్నారు. ఏదేమైనా తెలంగాణ ఏర్పాటు తర్వాత వరి పంట సాగు గణనీయంగా పెరిగింది.
తగ్గుతున్న పప్పు ధాన్యాలు..
ఈ ఖరీప్ సీజన్‌లో 132 లక్షల ఎకరా ల్లో వివిధ రకాల పంటలు సాగు అవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేస్తే.. ఇప్పటివరకు 82.65 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటల సాగు జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ శాఖ ఆశించిన దాంట్లో కేవలం 62 శాతం శాతం మాత్ర మే పంటలు వేశారు. అందులో పత్తి పంట అత్యధికంగా 46.33 లక్షల ఎకరా లు వేయగా, 20.46 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. జూలై నెలాఖరు నాటికి మరో 5 లక్షల ఎకరాల్లో నాట్లు వేయవచ్చని అధికారులు భావిస్తున్నారు.
మక్క లు, కందితో పాటు ఇతర పంటను 12 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగుచేశారు. 12 ఏళ్ల క్రితం 49.28 లక్షలు సాగైన వరి.. ప్రస్తుతం రెండు సీజన్లలో కలిపి 127 లక్ష ల ఎకరాలకు పెరిగింది. పత్తి 51 లక్షల ఎకరాల నుంచి 65 లక్షల ఎకరాలు దాటిం ది. ఇక పండ్ల తోటలు 9.11 లక్షల ఎకరాల నుంచి 4.48 లక్షల ఎకరాలకు పడిపోయాయి. కూరగాయల సాగు 5.52 లక్షల నుంచి 1.02 లక్షల ఎకరాలకు తగ్గింది.
పూల తోటలు 17,220 నుంచి 6248 ఎకరాలు, పసుపు 1.52 లక్షల ఎకరాల నుంచి 42,246 ఎకరాలు, పప్పు ధాన్యాలు 10.20 లక్షల నుంచి 8.83 లక్షల ఎకరాలు, నూనె గింజలు 12.41 లక్షల ఎకరాల నుంచి 7.13 లక్షల ఎకరాలు, చిరు ధాన్యాలు 19.58 లక్షల నుంచి 18.84 లక్షల ఎకరాలకు చేరింది.
ఉద్యాన పంటలు 19.82 లక్షల ఎకరాల నుంచి 12.46లక్షల ఎకరాలకు పడిపోయింది. అయితే ఇప్పటికైనా ప్రభుత్వం ఆరుతడి పంటలపై ప్రత్యేక దృష్టిసారించి, రైతులకు పలురకాల రాయితీలు, పంటలపై వ్యవసాయ శాఖ అధికారులతో అవగాహన సదస్సులు నిర్వహిస్తేనే రైతులు ప్రత్యామ్నాయ పంట వైపు ఆకర్షితులవుతారని రైతు సంఘాలు చెబుతున్నాయి.
కొనుగోలు చేస్తుందో లేదో..
కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు మండలాల వారీగా ఆరుతడి పంటల సాగుపై రైతులను చైతన్య పరుస్తున్నారు. అయినా ఆరుతడి పంటలు పండిస్తే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందో లేదోనన్న భయం కూడా రైతాంగాన్ని వెంటాడుతున్నది. ఈ సీజన్‌లో వ్యవసాయం చేయకపోయినా పర్వలేదు. ఆలస్యంగానైనా వర్షాలు పడి ప్రాజెక్టుల్లో నీరు ఉంటే యాసంగిలోనైనా పంటలు సాగు చేసుకోవచ్చని భావిస్తున్నారు.
మరోవైపు అక్కడక్కడా తొలకరి వర్షానికి నాటిన పత్తి మొలకలు వాడిపోతున్నాయి. వీలైనంత త్వరగా వర్షాలు కురిస్తే తప్ప పప్పు ధాన్యాల సాగుకు రైతులు ముందుకొచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ ఆరుతడి పంటలు వేస్తే మధ్యలో వానలు రాకుంటే పూర్తిగా ఎండిపోతాయని, పెట్టిన పెట్టుబడి కూడా నష్టపోవాల్సి వస్తోందని భయపడుతున్నారు.
ప్రభుత్వం పంట బీమా అమలుచేస్తే పండ్లు, కూరగాయలు, పూల తోటలు వేసేందుకు రైతాంగం ముందుకొచ్చే పరిస్థితి ఉంది. మరోవైపు కోతుల బెడద తెలంగాణలో పెద్ద సమస్యగా మారింది. వాటి భయానికి రైతులు పండ్లు, కూరగాయలను సాగు చేయడానికి భయపడుతున్నారు. వాటిని అదుపు చేసేందుకు పొలం చుట్టూ సోలార్ ఫెన్సింగ్ వేస్తే సరిపోతుందని.. అందుకోసం రాయితీపై పంపిణీ చేస్తామని ఉద్యానశాఖ చెప్పినా ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు.






