12 August, 2026 | 2:25 AM

అనుముల కొండల్‌రెడ్డికి అప్పనంగా భూమి

12-08-2026 01:27 AM

భారీ కుంభకోణం

రేవంత్‌రెడ్డి సోదరులంతా పెద్ద కంపెనీలకు యజమానులా?

రూ. 200 కోట్ల విలువైన భూమిని రూ. 7 కోట్లకే ఎలా కేటాయించారు?

  1. టెస్సరాక్ట్‌కు భూ కేటాయింపులపై సమగ్ర విచారణ జరపాలి
  2. ఒక్క ఉద్యోగి లేని, రూ.లక్ష మూలధనం ఉన్న కంపెనీకి రూ. 200 కోట్ల విలువైన ఐదెకరాల భూ కేటాయింపు ఎలా?
  3. గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తాం
  4. అవసరమైతే లోకాయుక్త, న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం
  5. వాస్తవాలు తేలే వరకు వదిలిపెట్టం
  6. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి

హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరుడు అనుముల కొండల్‌రెడ్డికి చెందిన టెస్సరాక్ట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ కంపెనీకి విలువైన ప్రభుత్వ భూమి కేటాయించిన వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. సీఎం సోదరులంతా పెద్దపెద్ద కంపెనీలకు యజమానులవుతున్నారని ఆరోపించారు. ఒక్క ఉద్యోగి లేని, రూ. లక్ష మూలధనం ఉన్న కంపెనీకి రూ.200 కోట్ల విలువైన ఐదెకరాల భూమి ఎలా కేటాయించారు? అని ప్రశ్నిం చారు.

ఈ విషయంపై గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. అవసరమైతే లోకాయుక్త, న్యాయస్థానాలను ఆశ్ర యిస్తామని, వాస్తవాలు తేలే వరకు వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు జీరో అని ఊరికే అనలేదు.. పాలమూరు-రంగారెడ్డి జాతీయ హోదాపై ఎంపీల వైఖరేందో చెప్పాలన్నారు. తెలంగాణ ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేసే కుట్రను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని, జీఆర్‌ఎంబీ (గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ) సమావేశాన్ని తెలంగాణ ప్రభుత్వం బహిష్కరించాలని, లేకుంటే జల ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు.

తెలంగాణ భవన్‌లో మంగళవారం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కొండల్‌రెడ్డి చెందిన కంపెనీ వివరాలు, దాని మూలధనం, ఉద్యో గుల సంఖ్య, కార్యాలయ చిరునామా, కంపెనీ చైర్మన్ వ్యవహారం, ప్రభుత్వ భూమి కేటాయింపు తదితర అంశాలను పరిశీలిస్తే ఇందులో భారీ కుంభకోణం జరిగిందని స్పష్టంగా అ ర్థం అవుతుందన్నారు. ఈ వ్యవహారం రాష్ట్ర ంలో జరిగిన అతిపెద్ద భూ కేటాయింపు అక్రమాల్లో ఒకటిగా తాము అనుమానిస్తున్నా మని పేర్కొన్నారు.

కొండల్‌రెడ్డి తన లింక్డ్ ఇన్ ప్రొఫైల్లో టెస్సరాక్ట్ అడ్వానస్డ్ సిస్టమ్స్, భూపాల్ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌కు తాను బాధ్యత వహిస్తున్నట్లు పేర్కొన్నారని కేటీఆర్ తెలిపారు. టెస్సరాక్ట్ సంస్థ ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో పనిచేస్తున్నట్లు పేర్కొంటూ నిర్వహించిన కార్యక్రమంలో అమెరికా కాన్సుల్ జనరల్ కూడా పాల్గొన్న విషయాన్ని ఆయ న ప్రస్తావించారు. అనంతరం యూఎస్ స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ ఫోరమ్ ఎగ్జిక్యూటివ్ బోర్డులో టెస్సరాక్ట్ అడ్వానస్డ్ సిస్టమ్స్ చైర్మన్‌గా కొండల్ చేరినట్లు సంబంధిత సంస్థ స్వయంగా ప్రకటించిందని కేటీఆర్ తెలిపారు. 

ఐదెకరాలు ఎలా కేటాయించారు?

టెస్సరాక్ట్ అడ్వానస్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వివరాలను పరిశీలించినప్పుడు అనేక అనుమానాస్పద అంశాలు బయటపడుతున్నా యని కేటీఆర్ అన్నారు. కంపెనీ వెబ్‌సైట్‌లో పేర్కొన్న ఫోన్ నంబర్ 123456789గా ఉందని, ఇలాంటి వివరా లు ఎలా ఉన్నాయో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, 2025 మార్చి 31 నాటికి కంపెనీలో ఒక్క ఉద్యోగి కూడా లేరని, ఉద్యోగుల సంఖ్య సున్నా అని కంపెనీ వివరాల్లోనే పేర్కొన్నట్లు తెలిపారు.

కంపెనీ పెయిడ్‌అప్ క్యాపిటల్ కేవలం రూ.1 లక్ష మాత్రమేనని, పటాన్‌చెరు ప్రాంతంలో ఒక చిన్న చిరునామాను కార్యాలయంగా చూపిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి ఆర్థిక సామర్థ్యం ఉన్న కంపెనీకి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సుమారు ఐదెకరాల ప్రభుత్వ భూమిని కేటాయించిందని, ఆ భూమి విలు వ సుమారు రూ.200 కోట్లు ఉంటుం దని కేటీఆర్ ఆరోపించారు. అయితే ఆ భూమిని సుమారు రూ.7 కోట్లకే, గజానికి సుమారు రూ.3,700 చొప్పున కేటాయించినట్లు వివరాలను వెల్లడించారు.

ఒక్క ఉద్యోగి లేని, రూ.లక్ష పెయిడ్‌అప్ క్యాపిటల్ ఉన్న కంపెనీకి రూ.200 కోట్ల విలువైన ప్రభుత్వ భూ మిని కేటా యించడం ఎలా సాధ్యమైంది? ఇది స్కాం కాదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. భూమి కేటాయింపునకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు, ధర నిర్ణయం, అర్హత ప్ర మాణాలు, పెట్టుబడి ప్రతిపాదనలు, ఉద్యోగాల కల్పన హామీలు, అధికారుల నిర్ణయా లు అన్నింటినీ ప్రభుత్వం ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు.

సంబంధంలేదని శ్రీధర్‌బాబు ఎలా చెబుతారు?

టెస్సరాక్ట్ కంపెనీకి, సీఎం సోదరుడు కొండల్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని మంత్రి శ్రీధర్‌బాబు చెబుతున్నారన్నారు. అయితే కొండల్ రెడ్డి స్వయంగా తన లింక్డ్‌ఇన్ ప్రొఫైల్లో టెస్సరాక్ట్ చైర్మన్‌గా పేర్కొన్నా రని, యూఎస్ స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ ఫోరమ్ కూడా ఆయనను టెస్సరాక్ట్ చైర్మన్‌గా పేర్కొన్నప్పుడు మంత్రి శ్రీధర్‌బాబు ఎలా సంబంధం లేదని చెబుతున్నా రని ప్రశ్నించారు. ‘మీ శాఖలో ఏం జరుగుతుందో మీకు తెలియదా? ముఖ్యమంత్రి సో దరుడికి ప్రత్యేక నిబంధనలు ఉన్నాయా?’ అని శ్రీధర్‌బాబును ఆయన నిలదీశారు.

కేవలం టెస్సరాక్ట్ వ్యవహారం మాత్రమే కాకుండా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, బంధువులకు సంబంధించిన ఇతర వ్యాపారాలు, భూములు, ఒప్పందాలు, కాంట్రాక్టు లపైనా గతంలో తాము ప్రశ్నలు లేవనెత్తామన్నారు. ముఖ్యమంత్రి మరో సోదరుడు అ నుముల జగదీష్‌రెడ్డి అమెరికాలో ఉండగా, ముఖ్యమంత్రి అమెరికా పర్యటన సందర్భంగా స్వచ్ఛ్ బయో సంస్థతో సుమారు రూ.1,000 కోట్ల ఒప్పందానికి సంబంధించిన ఎంఓయూ జరిగిందని కేటీఆర్ పేర్కొ న్నారు. ఆ ఒప్పందం తర్వాత ఆ సంస్థకు ఎక్కడైనా భూములు కేటాయించారా? పెట్టుబడులు వచ్చాయా? అనే అంశాలను కూడా వెలికి తీస్తామని తెలిపారు. 

అప్పుడు అమృత్ కూడా..

ముఖ్యమంత్రి బావమరిది సృజన్‌రెడ్డికి సంబంధించిన రూ.1,137 కోట్ల అమృత్ కాంట్రాక్టులపై గతంలోనే ప్రశ్నలు లేవనెత్తామని కేటీఆర్ గుర్తుచేశారు. సింగరేణి, సైట్ విజిటేషన్ సర్టిఫికెట్లు, ఇతర కాంట్రాక్టుల్లో నూ అక్రమాలు జరిగాయని తాము గతం లో ఆధారాలతో సహా ప్రజల ముందుంచామని అన్నారు. ఇప్పుడు టెస్సరాక్ట్ వ్యవహా రం అదే పరంపరలో తాజాగా వెలుగులోకి వచ్చిన అంశమని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి మరో సోదరుడు అనుముల తిరుప తిరెడ్డికి ఎలాంటి అధికారిక హోదా లేకపోయినా కొడంగల్‌లో అధికారిక కార్యక్రమా ల్లో పాల్గొంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. అధికారిక హోదా లేని వ్యక్తికి ఇంత ప్రోటోకాల్ ఎలా వస్తోంది?, ముఖ్యమంత్రి సోదరులకు ప్రత్యేక అధికారాలు, ప్రత్యేక నిబంధనలు ఉన్నాయా? అని ప్రశ్నించారు.

సమగ్ర విచారణ జరగాలి..

సీఎం కుటుంబ సభ్యులు, బంధువులకు సంబంధించిన అన్ని భూములు, కంపెనీలు, కాంట్రాక్టుల వివరాలను ప్రజల ముందుంచుతామని కేటీఆర్ తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించిన కాంట్రాక్టులు, కంపెనీల పైనా తాము గతంలో ప్రశ్నలు లేవనెత్తామన్నారు. అధికారంలో ఉన్న వ్యక్తుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వ వనరులు, భూములు, కాంట్రాక్టులు దక్కుతున్నాయ నే అంశంపై సమగ్ర దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా కర్ణాటకలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సతీమణికి భూమి కేటాయింపు వ్యవహారాన్ని కూడా కేటీఆర్ ప్రస్తావించారు. కర్ణాటకలో మూడు ఎకరాల భూ కేటాయింపుపై విచారణ, రాజకీయ ప్రకంపనలు వచ్చినప్పుడు తెలంగా ణలో రూ.200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కేటాయింపుపై ఎందుకు విచారణ జరగకూడదు? అని కేటీఆర్ ప్రశ్నించారు. క ర్ణాటకలో ఒక న్యాయం, తెలంగాణలో మరో న్యాయం ఎలా ఉంటుందని నిలదీశారు.

ఈ విషయంలో న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం

టెస్సరాక్ట్ భూ కేటాయింపు వ్యవహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని కేటీఆర్ స్పష్టం చేశారు. త్వరలోనే తెలంగాణ గవర్నర్‌ను కలిసి అధికారికంగా ఫిర్యాదు చేస్తామని, సమగ్ర విచారణ జరిపించాలని కోరుతామని తెలిపారు. అవసరమైతే లోకాయుక్తను, న్యాయస్థా నాలను కూడా ఆశ్ర యిస్తామన్నారు. భూమి కేటాయింపు నుంచి కంపెనీ కార్యకలాపాల వరకు ప్రతి అంశాన్ని విచారించి, ప్రభుత్వ ఆస్తుల కు నష్టం జరిగిందా, నిబంధనలు ఉల్లంఘించారా, ఎవరి కి ప్రయోజనం కలిగిందనే విషయాలను తేల్చాలని డిమాండ్ చేశారు.

టెస్సరాక్ట్ వ్యవహారంతో పాటు ప్రభుత్వ భూములు, కాం ట్రాక్టులు, అధికార దుర్వినియోగానికి సంబ ంధించిన ప్రతి అంశాన్ని ప్రజల ముందుకు తీసుకువచ్చే వరకు బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగుతుందని, ఈ వ్యవహారంలో ఎవరినీ వ దిలిపెట్టే ప్రసక్తే లేదని కేటీఆర్ తేల్చిచెప్పారు.

అజెండా నుంచి ప్రాజెక్టుల రద్దును తొలగించాలి

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతులు ఇచ్చిన ఏడు తెలంగాణ ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం కోరుతుండగా, ఆ అంశాన్ని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్‌ఎంబీ) అజె ండాలో చేర్చడం దారుణమన్నారు. తెలంగాణ ప్రయోజ నాలకు విరుద్ధంగా ఉన్న ఈ సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం బహిష్కరించాలని డిమాండ్ చేశారు.

కేంద్రం అనుమతు లు ఇచ్చిన తర్వాత వాటిని రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం పట్టుబడుతుంటే, అదే అంశా న్ని కేంద్రం ఆధీనంలోని జీఆర్‌ఎంబీ అజెండాలో పెట్టడం ఎంతవరకు సమంజసమని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వానికి ఆత్మగౌరవం, పౌరుషం ఉంటే సమావే శాన్ని బహిష్కరించాలని, ఏడు ప్రాజె క్టుల అనుమతుల రద్దు అంశాన్ని అజెండా నుం చి వెంటనే తొలగించాలని, లేకుంటే జల ఉద్యమాన్ని నిర్మిస్తామన్నారు. అవసరమైతే జలసౌ ధను ముట్టడిస్తామని, తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం బీఆర్‌ఎస్ ముందుండి పోరాడుతుందని తేల్చిచెప్పారు.

జాతీయ హోదాపై ఎంపీల వైఖరీ దారుణం...

పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా పై కాంగ్రెస్, బీజేపీ ఎంపీల వైఖరి దారుణమన్నారు. ‘8 + 8 = 0 అని ఊరికే అనలేదు.. తెలం గాణ ప్రయోజనాల కోసం పోరాడే ఎంపీలు లేరు’ అన్నారు. రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నప్పటికీ తెలంగాణ ప్రయోజనాల కోసం పార్లమెంట్లో ఒక్కరు కూడా గట్టిగా మాట్లాడటం లేదని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం కెన్ పోలవరం, అప్పర్ భద్ర వంటి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పిస్తుండగా, తెలంగాణలోని పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వబోమని పార్లమెంట్ లో స్పష్టంగా చెప్పినా తెలంగాణ ఏ ఎంపీ కూడా ప్రశ్నించలేదన్నారు. పంప్‌హౌస్‌లను ఆన్ చేసి రైతులకు నీరు అందించకుండా ప్రభుత్వం యాగాల పేరుతో ప్రజల దృష్టిని మళ్లిస్తోందని కేటీఆర్ విమర్శించారు. నార్లాపూర్, కన్నెపల్లి పంపులను వెంటనే ఆన్ చేయాలని డిమాండ్ చేశారు. దైవ ఆశీర్వాదానికి మానవ ప్రయత్నం తోడవాలి అని అన్నారు. 

ఎస్‌ఐఆర్‌పై పోరాటం..

తెలంగాణ భవన్‌లో కేటీఆర్ పార్టీ సర్ కమిటీతో సమావేశమయ్యారు. సర్ ప్రక్రియ లో క్షేత్రస్థాయిలో పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాలు, ఓటర్లకు ఎదురవుతున్న సమస్య లు, అర్హులైన ఓటర్ల ఓట్లు తొలగించకుండా తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ సభ్యులను అడిగి తెలుసుకు న్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్ అర్హులైన ఓటర్ల కు అన్యాయం జరగకుండా బీఆర్‌ఎస్ పోరా టం చేస్తుందన్నారు. 

సర్ ప్రక్రియ ప్రారంభానికి ముందు తెలంగాణలో మొత్తం 3 కోట్ల 39 లక్షల ఓట్లు ఉన్నాయని తెలిపారు. అం దులో దాదాపు 73 నుంచి 74 లక్షల ఓట్లు అన్‌కలెక్టబుల్’గా ఉన్నాయని, వాటి నుంచి ఇప్పటివరకు స్పందన రాలేదన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ఓట్లు ఉండటం, వాటి లో చాలా ఓట్లు తొలగించబడే అవకాశం ఉంద నే పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని అన్నా రు.

మొత్తంగా చూస్తే సర్ ప్రక్రియ పూర్తయ్యే నాటికి కేవలం సుమారు రెండు కోట్ల ఓట్లు మాత్రమే ఎలాంటి సమస్యలు లేకుండా మిగిలే పరిస్థితి కనిపిస్తోందన్నారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌తో చర్చించిన అనంతరం ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ అనంతరం నిర్వహించే సమావేశాల పూర్తి వివరాలు, కార్యాచర ణను వెల్లడిస్తామని తెలిపారు.