12 August, 2026 | 2:48 AM

నిషేధిత భూములపై అందోళన వద్దు

12-08-2026 01:44 AM
  1. 22 ఏ పేరుతో అర్హులకు అన్యాయం చేస్తే సహించం
  2. చట్టబద్ధంగా ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తాం
  3. యుద్ధ ప్రాతిపదికన దరఖాస్తుల పరిష్కారం
  4. ఈ నెల 14లోగా ఆన్‌లైన్‌లో డాక్యుమెంట్ల నమోదు
  5. ఆన్‌లైన్‌లో ఉన్న వివరాల మేరకే నిర్ణయాలు
  6. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
  7. ‘22ఎ/పీఓబీ అంశంపై కలెక్టర్లు, సబ్ రిజిస్ట్రార్లతో చర్చ

హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): నిషేధిత ఆస్తుల పిఓబి /22ఎ జాబితాలో ఉన్న భూములకు సంబంధించి ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని, చట్టబద్ధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హామీ ఇచ్చారు. కొత్తగా ఎలాంటి భూములను ప్రభుత్వ నిషేధిత జాబితాలో చేర్చలేదని, గత ప్రభుత్వం నుంచి కొనసాగుతున్న చట్టపరమైన సాంకేతిక చిక్కులను పరిష్కరించి బాధితులకు ఊరట కలిగిస్తామని స్పష్టం చేశారు.

మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయంలో 22ఎ/ పిఓబి అంశంపై  హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి కలెక్టర్లు, జిల్లా సబ్‌రిజిస్ట్రార్లతో మంత్రి పొంగులేటి చర్చించారు. 22ఏ సంబంధించి ప్రజావాణితో పాటు కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లకు, సబ్ రిజిస్ట్రార్లకు జిల్లాల వారీగా వచ్చిన దరఖాస్తులు ఎన్ని, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై  చర్చించారు. పిఓబి దరఖాస్తులకు సంబంధించి కేస్ బై కేసును ప్రతి రోజూ సమీక్షించాలని, 22ఎ పేరిట ఉద్దేశపూర్వకంగా పేదోడికి అర్హులకు అన్యాయం చేసే విధంగా వ్యవహరిస్తే ఊరుకునేదిలేదని మంత్రి హెచ్చరించారు.

భూముల రెగ్యులరైజ్‌కు సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు జారీ చేసిన జీవోలు, ఉత్తర్వులు, మెమోలు, భూసేకరణ ప్రొసీడింగ్స్, లే-అవుట్ల అనుమతులు తదితర వివరాలతో కూడిన అన్ని డాక్యుమెంట్లను ఈ నెల 14వ తేదీ లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. తద్వారా ఫోర్జరీ డాక్యుమెంట్లకు చెక్ పెట్టవచ్చని, రిజిస్ట్రేషన్ సమయంలో సబ్ రిజిస్ట్రార్లకు స్పష్టత వస్తుందని తెలిపారు. మరింత పారదర్శకత కోసం పహానీలు కూడా సబ్ రిజిస్ట్రార్‌కు ఏక్సెస్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 

సబ్ రిజిస్ట్రార్ల విచక్షణాధికారాలకు చెక్

సబ్ రిజిస్ట్రార్లకు విచక్షణాధికారాలు ఉండకూడదని, అదనపు అధికారాలు వద్దని ఈ విషయంపై గతంలోనే చాలా స్పష్టత ఇచ్చినట్టు మంత్రి గుర్తు చేశారు. ఆన్‌లైన్‌లో ఏది ఉంటే దానికి ఆమోదం తెలిపేవరకే వారి అధికారాలను పరిమితం చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడే విషయంలో ఏమాత్రం రాజీపడే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. ఏ చిన్న తప్పుచేసినా క్షమించేదిలేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఏదైనా సమస్య ఉంటే జిల్లా సబ్ రిజిస్ట్రార్లు కలెక్టర్ దృష్టికిగాని ఐజీ దృష్టికి గాని తీసుకురావాలని, పిఓబీ జాబితాలో ఉన్న ఆస్తుల రిజిస్ట్రేషన్లను గుడ్డిగా తిరస్కరించకుండా మూడు రోజుల సమయం తీసుకొని ఎందుకు తిరస్కరించవలసి వస్తుందన్న వివరాలను తెలియజేయాలని మంత్రి సూచించారు. 

పిఓబీకి సంబంధించి  వచ్చిన ప్రతి దరఖాస్తును ఇకనుండి తహశీల్దార్‌కు  పంపకుండా నేరుగా కలెక్టర్‌కే పంపించాలని,  కలెక్టర్ నుండి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ నుండి కలెక్టర్ మధ్యనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరగాలన్నారు.  గతంలో నాన్ అగ్రికల్చర్, అగ్రికల్చర్, పీఓబీ జాబితాలు వేర్వేరుగా ఉండేవి. వీటిని సమీకృతం చేయడం వలన సబ్ రిజిస్ట్రార్ పరిశీలనలో కొన్ని ఆస్తులు, నిషేధిత జాబితాలో ఉన్నట్లు కనిపిస్తున్నందున మొత్తం రిజిస్ట్రేషన్  ఆపుతున్నారని ఫిర్యాదుల వస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. 

తాజాగా నమోదు చేస్తున్న సమాచారంతో సరిపోల్చుకొని నిర్ణయాలు తీసుకోవాలని మంత్రి సూచించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయా లు   నాలుగు జిల్లాల పరిధిలోని సబ్ రిజిస్ట్రార్‌లకు వివరించి తక్షణమే అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీనీ మంత్రి పొంగులేటి ఆదేశించారు. ఈ సమావేశంలో రెవెన్యూ సెక్రెటరీ డి.ఎస్. లోకేశ్ కుమార్, స్టాంప్స్  రిజిస్ట్రేషన్ ఐ.జి. రాజీవ్ గాంధీ హనుమంత్ పాల్గొన్నారు.