టెండర్ గడువు ముగిసింది.. షాపులు ఖాళీ చేయలేదు
పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల షాపింగ్ కాంప్లెక్స్‌పై అధికారుల కొరడా
ఐదుసార్లు నోటీసులు ఇచ్చినా స్పందన శూన్యం.. షట్టర్లు సీజ్
భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారుల కఠిన చర్య
పెద్దపల్లి, ఆగస్టు 12 (విజయక్రాంతి): నిబంధనలు ఉల్లంఘిస్తూ టెండర్ గడువు ముగిసిన తర్వాత కూడా షాపులను ఖాళీ చేయని వారిపై పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల(Peddapalli Government Junior College) అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. షాపింగ్ కాంప్లెక్స్‌లోని షాపుల షట్టర్లను బుధవారం అధికారులు సీజ్ చేశారు.
టెండర్ గడువు ముగిసిన నేపథ్యంలో షాపులను ఖాళీ చేయాలని అధికారులు ఇప్పటికే ఐదుసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ సంబంధిత షాపుదారుల నుంచి స్పందన లేకపోయినట్లు తెలిసింది. నోటీసులను బేఖాతరు చేస్తూ షాపులను కొనసాగించడంతో అధికారులు ఇక వెనక్కి తగ్గకుండా సీజ్ చర్యలకు దిగారు.
షాపుల సీజ్ ప్రక్రియ నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్తతలు, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. పోలీసుల బందోబస్తు మధ్య అధికారులు షాపుల షట్టర్లను సీజ్ చేశారు.ప్రభుత్వ ఆస్తులను నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తే ఉపేక్షించేది లేదని అధికారుల చర్య స్పష్టం చేస్తోంది. పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకుండా షాపులను ఖాళీ చేయని వారిపై చివరకు సీజ్ వేటు పడటంతో ఈ వ్యవహారం పెద్దపల్లిలో చర్చనీయాంశంగా మారింది.






