యశస్వితో నా రికార్డుకు ముప్పు
విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా
న్యూఢిల్లీ: టీమిండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ టెస్టుల్లో తన రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉందని విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా వ్యాఖ్యానించాడు. తొమ్మిది టెస్టులు మాత్రమే ఆడినప్పటికీ ఎంతో పరిణితి చూపిస్తున్న జైస్వాల్ వల్ల 400 పరుగుల రికార్డుకు ప్రమాదం పొంచి ఉందని అభిప్రాయపడ్డాడు. ‘2023 ఐపీఎల్ సీజన్ జైస్వాల్‌ను పూర్తిగా మార్చేసింది. అతని విధ్వంసకర ఆట టెస్టుల్లో, టీ20ల్లో భారత్ తరపున కీలక ఆటగాడిగా మార్చేసింది. టెస్టుల్లో అతని యావరేజ్ 70కి పైగా ఉంది. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో రెండు డబుల్ సెంచరీలు బాదాడు. జైస్వాల్ ఆటతో నా రికార్డుకు ప్రమాదం పొంచి ఉంది. డబుల్ సెంచరీలతో తన సామర్థ్యాన్ని చూపించాడు. 400 కొట్టడం పెద్ద కష్టమేమి కాదేమో. త్వరలోనే అది కూడా చూసేస్తాం.’ అని లారా వెల్లడించాడు. ఇక టెస్టు క్రికెట్‌ను కాపాడేందుకు తగిన ప్రణాళిక చేపట్టాలంటూ లారా ఐసీసీని అభ్యర్థించాడు. టీ20 క్రికెట్ వల్ల సంప్రదాయ ఫార్మాట్‌కు జట్ల ఎంపికలో అన్యాయం జరుగుతుందని పేర్కొన్నాడు. సౌతాఫ్రికా టీ20 టోర్నీ కారణంగా న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు సౌతాఫ్రికా రెండో స్థాయి జట్టును ఎంపిక చేసింది. దీంతో ఆ జట్టు కివీస్ గడ్డపై ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఈ విషయాన్నే ప్రస్తావించిన లారా.. టెస్టు క్రికెట్ కాపాడేందుకు ఐసీసీ నిర్మాణాత్మకమైన ప్రణాళికను అమలు చేస్తే బాగుంటదని తెలిపాడు.






