ఉఫ్..
ఊదేసిన హైదరాబాద్
58 బంతుల్లో 167 పరుగులు
హెడ్, అభిషేక్ మెరుపు అర్ధశతకాలు
లక్నోపై సన్‌రైజర్స్ గ్రాండ్ విక్టరీ
అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ ఒకే సినిమాలో కలిసి నటించినట్లు..
రోజర్ ఫెదరర్, రఫేల్ నాదల్ కలిసి డబుల్స్ మ్యాచ్ ఆడినట్లు..
ఏఆర్ రెహమాన్, ఇళయరాజా ఒకే పాటకు ట్యూన్ కట్టినట్లు..
వంతులు వేసుకొని మరీ సన్‌రైజర్స్ ఓపెనర్లు విధ్వసం సాగించిన వేళ.. లక్నో సూపర్ జెయింట్స్ విధించిన లక్ష్యం మరీ చిన్నదైపోయింది! ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో హైదరాబాద్ విశ్వరూపం కనబర్చింది. లక్నో బౌలర్లపై మనవాళ్ల సాగించిన ఊచకోత మాటలకందనిది.
వర్షంతో తడిచి ఉన్న ఉప్పల్ పిచ్‌పై మన బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో రెచ్చపోవడంతో లక్నో ఓ మాదిరి స్కోరుకే పరిమితం కాగా.. ఆనక ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ స్టేడియాన్ని మోతెక్కించారు. ఒక మెరుపులాంటి షాట్‌ను ఆస్వాదించే లోపే.. మరో పిడుగు లాంటి షాట్‌తో విరుచుకుపడటంతో ప్రేక్షకులు మంత్రముగ్దులై వీక్షించడం తప్ప మరేం చేయలేకపోయారు. ఇప్పటికే వీర బాదుడులో కొత్త ప్రమాణాలు నెలకొల్పిన రైజర్స్.. ఈ మ్యాచ్‌లో దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. 166 పరుగుల లక్ష్యాన్ని 10 ఓవర్లలోపే ఛేదించి ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నామని ప్రత్యర్థులకు గట్టి హెచ్చరికలు పంపింది. గ్రాండ్ విక్టరీతో నెట్ రన్‌రేట్‌ను భారీగా మెరుగు పరుచుకున్న రైజర్స్.. ఇక మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఇదే జోరు కొనసాగిస్తే.. ప్లే ఆఫ్స్‌కు చేరడం ఖాయమే!
విజయక్రాంతి, ఖేల్ ప్రతినిధి: సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి విజృంభించింది. బౌలర్ల క్రమశిక్షణకు ఓపెనర్ల దంచుడు తోడవడంతో రైజర్స్.. తాజా సీజన్‌లో ఏడో విజయం ఖాతాలో వేసుకుంది. బుధవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఏకపక్ష పోరులో హైదరాబాద్ 10 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తుచేసి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన లక్నో.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఆయుష్ బదోనీ (30 బంతుల్లో 55 నాటౌట్; 9 ఫోర్లు), నికోలస్ పూరన్ (26 బంతుల్లో 48 నాటౌట్; 6 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించారు. బౌలింగ్‌కు అనుకూలంగా కనిపించిన పిచ్‌పై హైదరాబాద్ బౌలర్లు దుమ్మురేపడంతో డికాక్ (2), స్టొయినిస్ (3) విఫలమయ్యారు. మన బౌలర్లలో భువనేశ్వర్ 4 ఓవర్లలో కేవలం 12 పరుగలే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో హైదరాబాద్ 9.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 167 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (30 బంతుల్లో 89 నాటౌట్; 8 ఫోర్లు, 8 సిక్సర్లు), అభిషేక్ శర్మ (28 బంతుల్లో 75 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలతో రెచ్చిపోయి జట్టును గెలిపించారు. వీరిద్దరి విజృంభణకు లక్నో బౌలర్లు బెంబేలెత్తిపోగా.. మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వచ్చిన అభిమానులు పండగ చేసుకున్నారు. హెడ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్‌లో భాగంగా గురువారం పంజాబ్ కింగ్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది.
బాదుడే బాదుడు..
వామ్మో ఏందా కొట్టుడు.. ఏంటా షాట్లు.. ఒక దాన్ని మించి ఒకటి.. ఒకరిని మించి మరొకరు దంచికొట్టిన వేళ.. ఉప్పల్‌లో లక్నో బౌలర్లకు పీడకల మిగిలింది. రైజర్స్ బౌలింగ్ యూనిట్ సత్తాచాటిన చోట.. ఏమాత్రం లక్నో బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోగా.. మన ఓపెనర్లు సునామీలా విరుచుకుపడ్డారు. ఛేదన తొలి ఓవర్‌లో 8 పరుగులు చేసిన హైదరాబాద్.. ఆ తర్వాత విశ్వరూపం చూపింది. రెండో ఓవర్‌లో అభిషేక్ నాలుగు ఫోర్లతో మోత మొదలు పెడితే.. మూడో ఓవర్‌లో హెడ్ 6,4,6,6 అరుసుకున్నాడు. ఒక ఓవర్ నీ వంతైతే.. మరొకటి నాది అన్నట్లు ఈ జోడీ చెలరేగిపోయింది. నాలుగో ఓవర్‌లో ఇద్దరు కలిసి రెండు సిక్సర్లు ఒక ఫోర్ బాదగా.. ఐదో ఓవర్‌లో హెడ్ 4,4,6,4,4 బాదాడు. ఈ క్రమంలో హెడ్ 16 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. మరుసటి ఓవర్‌లో తానేం తక్కువా అన్నట్లు 4,6,4,6 తో రెచ్చిపోయిన అభిషేక్ కూడా 19 బంతుల్లో హాఫ్‌సెంచరీ నమోదు చేసుకున్నాడు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికే రైజర్స్ 107 పరుగులు చేయగా.. ఆ తర్వాత కూడా బాదుడు అదే స్థాయిలో కొనసాగించి మరో 62 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. మిగిలి ఉన్న బంతుల పరంగా ఐపీఎల్ చరిత్రలో ఇదే అది పెద్ద విజయం కాగా.. రైజర్స్ ప్లే ఆఫ్స్‌కు మరింత చేరువైంది. అంతకుముందు హైదరాబాద్ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు అంతకుమించి పకడ్బందీ ఫీల్డింగ్ తోడవడంతో లక్నో ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది.
16 హాఫ్ సెంచరీకి హెడ్ తీసుకున్న బంతులు. సీజన్‌లో అతడికిది రెండో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ. ఇంతకముందు ఢిల్లీతో మ్యాచ్‌లో అన్నే బంతుల్లో అర్థసెంచరీ మార్క్ అందుకున్నాడు.
62 మిగిలిఉన్న బంతుల పరంగా ఐపీఎల్ చరిత్రలో ఇదే అతిపెద్ద విజయం. ఇంతకముందు పంజాబ్‌పై ఢిల్ల్లీ (57 బంతులు మిగిలుండగా) రికార్డు తుడిచిపెట్టుకుపోయింది.
4 ఐపీఎల్లో పవర్ ప్లే ముగిసే లోపే హెడ్ సాధించిన అర్థసెంచరీల సంఖ్య. ఈ జాబితాలో వార్నర్ (6) అగ్రస్థానంలో ఉన్నాడు.
పాయింట్ల పట్టిక 2024
జట్టు మ్యా గె ఓ ర.రే పా
కోల్‌కతా 11 8 3 1.45 16
రాజస్థాన్ 11 8 3 0.47 16
హైదరాబాద్ 12 7 5 0.40 14
చెన్నై 11 6 5 0.70 12
ఢిల్లీ 12 6 6 12
లక్నో 12 6 6 12
బెంగళూరు 11 4 7 8
పంజాబ్ 11 4 7 8
ముంబై 12 4 8 8
గుజరాత్ 11 4 7 8
నోట్: మ్యా గె
ఓ ర.రే పా






