పంజాబ్ x బెంగళూరు
ధర్మశాల: ఐపీఎల్ 17వ సీజన్‌లో ప్లేఆఫ్ ఆశలు దాదాపుగా మూసుకుపోయినవేళ పంజాబ్ కింగ్స్ సొంతగడ్డపై మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. ధర్మశాల వేదికగా వరుస విజయాలతో జోరు మీదున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ అమితుమీ తేల్చుకోనుంది. సీజన్‌లో బెంగళూరు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో పట్టికలో ఏడో స్థానంలో ఉండగా.. అన్నే మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ 8వ స్థానంలో కొనసాగుతోంది. మ్యాచ్‌లో ఎవరు గెలిచినా ప్లేఆఫ్ అవకాశాలు అంతంత మాత్రమే కావడంతో పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది. పంజాబ్ బ్యాటింగ్‌లో బెయిర్ స్టో, శశాంక్ సింగ్, అశుతోష్ శర్మలు మంచి టచ్‌లో కనిపిస్తున్నారు. ధావన్ ఈ మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉండకపోవడంతో సామ్ కరన్ మరోసారి జట్టును నడిపించనున్నాడు. బౌలింగ్ విభాగం రబాడ, అర్షదీప్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చహర్‌లతో పర్వాలేదనిపిస్తోంది. ప్లేఆఫ్ చాన్స్ కోల్పోయిన తర్వాత బెంగళూరు జట్టు వరుస విజయాలు సాధిస్తుంది. ఓపెనింగ్ జోడీ కోహ్ల్లీ, డుప్లెసిస్‌లు మంచి ఆరంభాలు అందిస్తున్నప్పటికి మిగతావారు పెద్దగా రాణించడం లేదు. ఫినిషర్‌గా దినేశ్ కార్తిక్ మాత్రం తన పాత్రకు న్యాయం చేస్తున్నాడు. బౌలింగ్‌లో సిరాజ్ గాడిన పడడం సానుకూలాంశం. కర్ణ్ శర్మ, విజయ్ కుమార్ వైశాఖ్‌లు పర్వాలేదనిపిస్తున్నారు. ఇక సీజన్‌లో ఇరుజట్ల మధ్య జరిగిన తొలి అంచె పోటీలో బెంగళూరు విజయం సాధించింది. మరి సొంతగడ్డపై బెంగళూరును ఓడించి పంజాబ్ ఓటమికి బదులు తీర్చుకుంటుందా అన్నది ఆసక్తికరం.






