పేదలతో నాది పేగు బంధం
- గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
- 4 వేల నిరుపేద కుటుంబాలకు బ్రాక్ వెనుదన్ను
- సెర్ప్‌తో అవగాహన కుదుర్చుకున్న బ్రాక్ ఇంటర్నేషనల్
హైదరాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి): పేదరికం నుంచి వచ్చిన తనకు పేదలతో పేగు బంధం ఉన్నదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. నిరుపేదల జీవితాల్లో మార్పు తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పేదరికాన్ని రూపుమాపడానికి తమ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని వెల్లడించారు. పేదరిక నిర్మూలనకు తమ ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో పాలుపంచుకోవాలని స్వచ్ఛంద సంస్థలకు పిలుపుని చ్చారు. మంగళవారం సచివాలయంలో మంత్రి సీతక్క సమక్షంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్), పలు దేశాల్లో పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తున్న బ్రాక్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సంస్థ అవగాహన కుదు ర్చుకున్నాయి.
ఈ మేరకు కుమ్రంభీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్‌కర్నూల్, నారాయణ పేట, వికారాబాద్ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ౪ వేల అత్యంత పేద కుటుంబాలను గుర్తించి, వారిని పేదరికం నుంచి బయటకు తెచ్చేలా బ్రాక్ పనిచేయనుంది. మూడేళ్ల పాటు ఆయా కుటుంబాలకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం మొదలుకొని మెరుగైన జీవనోపాధి కల్పించే వరకు బ్రాక్ సహకారం అందించనుంది. ప్రభుత్వం, ప్రజా సంఘాలు, సేవా సంస్థలు అంకితభావంతో పనిచేస్తే పేదరికాన్ని రూపుమాప వచ్చని సీతక్క అన్నారు.కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్‌కుమార్, సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్, బ్రాక్ ఇంటర్నేషనల్ సంస్థ ఇండియా హెడ్ శ్వేతాబెనర్జీ, ఆగాఖాన్ ఫౌండేషన్ సీఈవో టిన్ని స్వహ్ని, ప్రధాన్, క్రిస్ప్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఉచిత ప్రయాణంతో మహిళలకు రూ.17 కోట్ల ఆదాపై హర్షం
రాఖీ పండుగ రోజున రికార్డు స్థాయిలో ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలు వినియోగించుకోవడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తంచేశారు. సోమవారం మొత్తం 41.74 లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేయగా, వారికి రూ.17 కోట్లు ఆదా అయిందని చెప్పారు. ఇది రేవంత్‌రెడ్డి సర్కార్ రాష్ట్ర మహిళలకు ఇచ్చిన రాఖీ కానుకగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ సిబ్బందిని అభినందించారు.






