గ్లోబల్ డెస్టినేషన్‌గా హైదరాబాద్
- బిల్డర్ల సమస్యలకు త్వరలోనే పరిష్కారం
- స్టాంప్ డ్యూటీ తగ్గించేందుకు కృషి చేస్తాం
- ఇరిగేషన్‌శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- త్వరలో ఆర్‌ఆర్‌ఆర్ పనులు ప్రారంభిస్తాం
- రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 20 (విజయక్రాంతి): హైదరాబాద్ మహా నగరం పెట్టుబడులకు గ్లోబల్ డెస్టినేషన్‌గా అవతరిస్తుందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం నోవాటెల్ హోటల్‌లో క్రెడాయ్ తెలంగాణ స్టేట్‌కాన్ 2024 సదస్సు నిర్వహించారు. సదస్సులో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌లో రియల్ బూమ్ వస్తుందని చెప్పారు. నిర్మాణ రంగానికి ప్రభుత్వం అన్నివేళలా అండగా ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో పట్టణీకరణ పెరుగుతుందని, ఇందులో క్రెడాయ్ బిల్డర్లు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. బిల్డర్లు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. వృద్ధి రేటు దేశంలోనే అధిక శాతం ఉండేవిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టు, హైదరాబాద్ అవుటర్ రింగ్‌రోడ్, పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ వే, మెట్రో వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే చేసిందని గుర్తుచేశారు. సీఎం, డిప్యూటీ సీఎంతోపాటు తామంతా కలిసికట్టుగా పని చేసి హైదరాబాద్‌కు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని పునరుద్ఘాటించారు. మూసీ అభివృద్ది, రీజనల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీగా ముచ్చర్ల ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంతోపాటు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుతో హైదరాబాద్ నగరాన్ని మరో లెవెల్‌కు తీసుకెళ్తామని స్పష్టంచేశారు. రియల్ పరిశ్రమ వృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. స్టాంప్ డ్యూటీని తగ్గించే విషయమై ప్రభుత్వంతో చర్చిస్తామని చెప్పారు. ప్రపంచస్థాయి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను హైదరాబాద్‌లో డెవలప్ చేస్తామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.
త్వరలోనే ఆర్‌ఆర్‌ఆర్ పనులు ప్రారంభం
రీజనల్ రింగ్ రోడ్డు పనులను త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. జిల్లాల నుంచి బిల్డర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనడం సంతోషకరమని అన్నారు. ఈ సదస్సు తెలంగాణ నిర్మాణ రంగానికి బాటలు వేసే వేదిక అవుతుందని పేర్కొన్నారు. కోకాపేట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేసిన ఘనత తమకే దక్కుతుందన్నారు. గతంలో ఔటర్ రింగ్ రోడ్డు గేమ్ ఛేంజర్‌గా మారి హైదరాబాద్‌కు ఎలాగైతే ఇన్వెస్ట్‌మెంట్లు వచ్చాయో.. అదేవిధంగా ప్రస్తుతం రీజినల్ రింగ్ రోడ్డు సూపర్ గేమ్ ఛేంజర్‌గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు, మూడు నెలల్లో రీజనల్ రింగ్ రోడ్డు పనులను ప్రారంభిస్తామని చెప్పారు.
దక్షిణ హైదరాబాద్‌లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇందుకోసం బీసీసీఐని సంప్రదించామని వెల్లడించారు. తాము ౨౪ గంటలు నిర్మాణ రంగానికి అందుబాటులో ఉంటామని చెప్పారు. కార్యక్రమంలో క్రెడాయ్ నేషనల్ సెక్రటరీ గుమ్మి రాంరెడ్డి, నేషనల్ ఈసీ మెంబర్ చెరుకు రామచంద్రారెడ్డి, తెలంగాణ చైైర్మన్, ప్రెసిడెంట్, సెక్రటరీలు మురళీకృష్ణారెడ్డి, ప్రేమ్‌సాగర్‌రెడ్డి, అజయ్‌కుమార్, తెలంగాణ (ప్రెసిడెంట్- ఎలక్ట్) ఇంద్రసేనారెడ్డి, క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు ఎస్‌ఎంఆర్ రాంరెడ్డి, పౌలోమీ ఎస్టేట్స్ ఎండీ ప్రశాంత్‌రావు, జనప్రియ ఇంజినీర్స్ అధినేత కే రవీందర్‌రెడ్డితోపాటు రాష్ట్రంలోని ౧౫ చాప్టర్ల బిల్డర్లు పాల్గొన్నారు.






